తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షనేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీఎల్పీనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభాపక్ష నేతగా ఈసారి చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. వాటికి తెరదించుతూ... శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత తదితర అంశాలపై చర్చించారు.
జగన్ పట్ల ఉన్న సానుభూతితోనే ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నిత్యం ప్రజల మధ్యే ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు పార్టీ నేతల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓడిపోయామని చింతించాల్సిన అవసరం లేదన్నారు. ఆ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని ఉటంకిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్.. నేడు రెండోసారి కూడా అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుదామని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.