టీవీ9 సీఈవో రవిప్రకాష్‌కు కొత్త యాజమాన్యం అలంద మీడియా కోలుకోలేని షాకిచ్చింది. ఇప్పటి వరకూ టీవీ9 సీఈవో, చైర్మన్, ఫౌండర్‌గా రవిప్రకాష్‌కు కొత్త యాజమాన్యం ఉద్వాసన పలికింది. టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాష్‌ను తొలగించి ఆయన స్థానంలో కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రాను నియమించింది. ఇదిలా ఉంటే సీఓఓగా గొట్టిపాటి సింగారావును యాజమాన్యం నియమిస్తున్నట్లు తెలిపింది. కొద్దిసేపటి క్రితం ఏబీసీఎల్ డైరెక్టర్స్ సమావేశమయ్యారు. టీవీ9కు కొత్త సీఈవో, సీఓఓలను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం టీవీ9 కన్నడకు ఎడిటర్, సీఈవోగా మిశ్రా బాధ్యతలు నిర్వహించారు. గొట్టిపాటి సింగరావు ప్రస్తుతం టెన్ టీవీ సీఈఓగా ఉన్నారు. మీడియా డైరెక్టర్లు అధికారికంగా ప్రకటించనున్నారు. గురువారం సాయంత్రం లైవ్‌లోకి వచ్చిన రవిప్రకాష్ తానే సీఈవోనని.. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. చేయబోరు అని చెప్పుకొచ్చారు.

ravi 10052019

ఇదిలా ఉంటే.. టీవీ-9 సీఈవో రవి ప్రకాశ్‌ మీద చీటింగ్‌, ఫోర్జరీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త యాజమాన్యం రవిప్రకాష్‌పై కేసులు పెట్టడమే కాకుండా ఆయన్ను టీవీ9 సీఈవోగా ఉద్వాసన పలకడం జరిగింది. తొంభై శాతం వాటాలు కొనుగోలు చేసినా తమకు కంపెనీ నడిపే అవకాశం ఇవ్వకుండా రవిప్రకాశ్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ అలంద మీడియా ఆరోపించిన విషయం విదితమే. మరో పక్క, తనను తొలగించటం పై రవిప్రకాష్ బహిరంగ లేఖ రాశారు. "వెనుకదారిలో అక్రమంగా ప్రవేశించిన బోర్డు సభ్యులకు, నేను.. రవిప్రకాష్.. tv9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే tv9 పని పట్టాని ఈ చర్యలకు దిగారు. "

 

ravi 10052019

"అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో tv9 సంస్థలోకి జొరబడ్డారు. ఎన్ సిఎల్ టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు. ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో tv9 ని కంట్రోల్ లోకి తీసుకున్నారు. తప్పుడు కంప్లయింట్స్ తో, తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు. పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు. మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్ గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. దేశంలో జర్నలిజాన్ని కాపాడడానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్నినిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. - రవిప్రకాష్"

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళ్లారు. శనివారం నుంచి ఈ నెల 15 వరకు ఆయన సెలవు తీసుకున్నారు. ఈ నెల 16న ఆయన మళ్లీ సచివాలయానికి రానున్నారు. రాష్ట్ర కేబినెట్‌ నిర్వహణ కోసం స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన అజెండాను ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ)కి పంపారు. ఈసీఐ నుంచి అనుమతి వచ్చేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. కేబినెట్‌పై సోమవారం సాయంత్రానికి ఈసీఐ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర కేబినెట్‌ భేటీ ఎజెండాలో పెట్టిన నాలుగు అంశాలను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆమోదానికి పంపాలని స్ర్కీనింగ్‌ కమిటీ నిర్ణయించింది.

dwivedi 10052019

గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ కమిటీ సమావేశమైంది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి, విపత్తు నిర్వహణ, పశుసంవర్ధక శాఖల కార్యదర్శులు వరప్రసాద్‌, శ్రీధర్‌, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌ కరికాల వలవన్‌ హాజరయ్యారు. ఫణి తుఫాను, నీటి ఎద్దడి, ఉపాధి హామీ, ఎండలు, కరువు, పశుగ్రాసం అంశాలను కేబినెట్‌ భేటీలో చర్చించేందుకు స్ర్కీనింగ్‌ కమిటీ ఆమోదించింది. వీటిని ఎన్నికల సంఘం ఆమోదానికి పంపాలని తీర్మానించింది. ఆయా అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు జతచేసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గోపాల కృష్ణ ద్వివేదికి పంపారు. దీనిపై ద్వివేది కూడా స్పందించారు. ఎజెండా కాపీ తనకు వచ్చిన వెంటనే కమిషన్‌కు పంపానని తెలిపారు.

dwivedi 10052019

అలా వెళ్లిన ఎజెండాను ఈసీ ఆమోదిస్తేనే 14వ తేదీన కేబినెట్‌ భేటీ జరుగుతుంది. కేబినెట్‌ ఎజెండాలో పొందుపరచిన ఉపాధి హామీ అంశంలో పెండింగ్‌ నిధుల వ్యవహారం ప్రధానమైదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద కేంద్రం నుంచి రూ.1,800 కోట్లు రావలసి ఉంది. ఇందులో రూ.367 కోట్లకు కేంద్రం ఇటీవల రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. అవి ఇంకా రాష్ట్ర ఖాతాలో జమ కాలేదు. దీనికి సంబంధించి రాష్ట్ర వాటా కింద రూ.125 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ అంశాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ కేబినెట్‌ ఎజెండాలో ప్రస్తావించింది. ప్రస్తుతం నిధుల కొరత ఉన్న కారణంగా ఉపాధి హామీ నిధుల్లో రాష్ట్ర వాటా విడుదల చేయలేకపోయామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. కేంద్రం రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చినా.. రాష్ట్ర ఖాతాలో జమ కావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. వారం రోజుల్లో ఈ చెల్లింపులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

5 విడతలు ఎన్నికలు జరిగిన తీరు, అధికారం కోల్పోతున్నాం అనే అంచనాలు రావటంతో, రోజు రోజుకీ మోడి ఎలా దిగజారి మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఒక ప్రధాని స్థాయి నేతగా కాకుండా, విజయసాయి రెడ్డి స్థాయిలో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మొదటిసారి చంద్రబాబు ఆరోపణల పై డైరెక్ట్ మోడీ స్పందించారు. ఈవీఎంల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యక్తం చేసిన అనుమానాలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ పర్యటనలపై కూడా ఆయన నోరు మెదిపారు. తొలి మూడు దశల పోలింగ్ సమయంలో తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఇప్పుడు గాలి ఎటు వీస్తుందో తెలిసి ఈవీఎంలపై నిందలేస్తున్నారని మోదీ విమర్శించారు. క్రికెట్‌లో కొన్నిసార్లు ఔటయిన బ్యాట్స్‌మెన్ అంపైర్‌ను తప్పుబట్టినట్టు, ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతున్నారని మోదీ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.

modi 10052019

మరోపక్క చంద్రబాబు ఈ రోజు కూడా మోడీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ ప్రధానిగా ఇకపై ఉండరని సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంటరీ సమీక్షలో సీఎం మాట్లాడుతూ మోదీపై ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక గాలిని ఉధృతం చేశామని చెప్పారు. అలాగే బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా ఏకం చేశామని తెలిపారు. ఓటమి భయంతోనే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గురించి మాట్లాడుతున్నారంటేనే అర్థమవుతుందన్నారు. గత ఐదేళ్లలో మోదీ చేసింది ఏమీలేదు కాబట్టే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దేశానికి రాబోయేది కొత్త ప్రధానే.. మోదీ ప్రధానిగా ఇకపై ఉండరని వివరించారు. భారత రాజకీయాల్లో హుందాతనం మోదీ వల్లే కొరవడిందని చెప్పారు.

modi 10052019

గుజరాత్ మోడల్ అనేది మోదీ సృష్టించిన శూన్యం తప్ప ఏమీలేదన్నారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభం అయ్యిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం కోసమే బీజేపీపై తిరగబడినట్లు వెల్లడించారు. ప్రత్యర్ధులపై ఈడీ, ఐటీ ద్వారా కక్షసాధింపు గతంలో లేదని పేర్కొన్నారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసమే తొలిసారి సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు స్పష్టంచేశారు. రాష్ట్రానికి న్యాయం కోసమే తెలుగుదేశం పార్టీ ధర్మపోరాటం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేకశక్తులను కూడగట్టామన్న చంద్రబాబు ... భాజపాకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు. మోదీ వ్యతిరేక గాలిని దేశవ్యాప్తంగా ఉద్ధృతం చేశామని, ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

 

భారత సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా న్యూస్ మ్యాగజైన్ ‘టైమ్’ సంచలన కథనం ప్రచురించింది. అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేక అంతర్జాతీయ ఎడిషన్‌ తీసుకొచ్చింది. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను కవర్‌ పేజీపై ప్రచురించింది. మే 20, 2019న వెలువడే టైమ్‌ మ్యాగజైన్‌ యూరప్‌, మధ్య ప్రాశ్చ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్‌ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ కవర్‌స్టోరీ ప్రచురించింది. ‘‘భారతదేశ ప్రధాన విభజనకారి’’ అన్న శీర్షికతో మోదీ క్యారికేచర్‌ను కవర్‌పేజీపై ముద్రించింది. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వాన్ని భరించగలదా?’’ అని రచయిత అతిష్ తషీర్ ప్రశ్నించారు.

times 10052019 1

‘‘జనాకర్షక దిశగా పతనమైన గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైనా ఉంటే అది భారతదేశమే...’’ అంటూ ఈ కథనం ప్రారంభమవుతుంది. టర్కీ, బ్రెజిల్, బ్రిటన్, అమెరికా తదితర ప్రజాస్వామ్య దేశాల్లో మాదిరిగా భారత్‌లో ఈ జనాకర్షక రాజకీయం ముసురుకుంటున్నదని రచయిత పేర్కొన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లౌకికవాదాన్ని, ‘‘మోదీ హయాంలో ప్రబలుతున్న సామాజిక ‘‘ఉద్రిక్తత’’తో పోల్చుతూ ఈ కథనం సాగింది. దీంతో పాటు వందలాది మందిని బలిగొన్న గుజరాత్ అల్లర్లను కూడా ఈ ఆర్టికల్‌లో గుర్తుచేశారు. బీజేపీ హిందూత్వ రాజకీయాలే భారత ఓటర్లు నిలువునా చీలడానికి కారణమని రచయిత ప్రముఖంగా పేర్కొన్నారు. ‘‘2014 ఎన్నికల తర్వాత స్వాతంత్ర్య భారత రాష్ట్రాల ప్రాధమిక సిద్ధాంతాలు, దాని సమరయోధులు, మైనారిటీ స్థానం సహా దేశంలో ఆయన వ్యవస్థల మధ్య తీవ్ర అపనమ్మకాలు ఏర్పాడ్డాయి’’ అంటూ మోదీపై టైమ్ మ్యాగజైన్ విమర్శలు గుప్పించింది.

times 10052019 1

‘‘2014 ఎన్నికల తర్వాత స్వాతంత్ర భారత ప్రధాన లక్ష్యాలైన లౌకికవాదం, ఉదారవాదం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి వాటిని చాలామంది అతిపెద్ద కుట్రలో భాగంగా చూస్తున్నారు...’’ అంటూ టైమ్ కథనం పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్లపై మౌనం దాల్చిన కారణంగా మోదీ ‘‘అల్లరి మూకలకు స్నేహితుడిగా మారారంటూ’’ రచయిత విమర్శించారు. గోహత్యలపైనా మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని కూడా టైమ్ మ్యాగజైన్ ప్రశ్నించింది. కాగా ఈ మ్యాగజైన్ మోదీని విమర్శించడం ఇదే తొలిసారి కాదు. 2012లో ఇదే మ్యాగజైన్ ప్రచురించిన ఓ కథనంలో... మోదీని వివాదాస్పద, ఒత్సాహిక, తెలివైన రాజకీయ నాయకుడిగా పేర్కొంది. కాగా తాజాగా ప్రచురితమైన ఈ కథనం ప్రతిపక్ష పార్టీలకు సరికొత్త ఆయుధంగా మారింది. ‘‘మీ గురించి అందరూ నిజం తెలుసుకోవాలి...’’ అంటూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ మోదీకి ట్వీట్ చేసింది.

 

Advertisements

Latest Articles

Most Read