ఎన్నికల ఫలితాలకు 43 రోజుల గ్యాప్ ఉండటంతో, ఎన్నో విచిత్రాలు చూస్తున్నాం. అక్కడ రిజల్ట్ ఎలా ఉన్నా, కొంత మంది అధికారుల ఓవర్ ఆక్షన్ మాత్రం, మరీ ఎక్కువగా ఉంది. వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తున్న కొందరు ముఖ్య అధికారులు... జగన్ శిబిరం మెప్పు కోసం కీలక ఫైళ్ల ప్రతులను అందిస్తున్నట్లు తెలిసింది. ఆ పార్టీ అభిమానులుగా ముద్ర వేయించుకుంటే, భవిష్యత్తులో పనికొస్తుందనే ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి... ‘‘మీకు ఏ అంశానికి సంబంధించిన ఫైలు కావాలో చెప్పండి. ఆ ఫైలు, దానిలోని నోట్ ఫైలు ప్రతులన్నీ తీసి పంపిస్తాం’’ అని ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. ఏదైనా నిర్ణయం వెనుక తప్పు జరగడం, జరగకపోవడంతో సంబంధం లేకుండా ‘మీకు పనికొస్తుందేమో చూడండి’ అంటూ సలహా ఇవ్వడంతోపాటు ఫైలుప్రతిని అందిస్తున్నారు.
ప్రైవేటు వ్యక్తులను తమ కార్యాలయాల్లోకి రప్పిం చి ఫైళ్ల ప్రతులను ఇచ్చి పంపించేస్తున్నారు. ని త్యం నిఘా ఉండే సచివాలయ శాఖల్లో ప్రైవేటు వ్యక్తులు యథేచ్చగా వచ్చి వెళ్లిపోతున్నారు. ఇది మిగిలిన అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తాము కీలక స్థానాల్లో ఉండగా తీసుకున్న నిర్ణయాలను వివాదాస్పదం చేస్తే ఎలా? తమను తాము కాపాడుకునే ఆధారాలు ఉంటే మంచిదని జాగ్రత్తపడుతున్నారు. ఆ నిర్ణయాల సందర్భంగా స్వదస్తూరీ రాసిన తమ అభిప్రాయాల తాలూకు నోట్‌ఫైళ్ల నకళ్లు తీసుకుని, భద్రపరుచుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ నిర్ణయాలపై ఎలాంటి వివాదాలు వచ్చినా.. ఈ సమాచారం దగ్గర ఉంటే మంచిదన్నది వీరి భావన.
ప్రభుత్వంలో కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు సంబంధిత ఫైల్‌లో రాసిన నోట్ చాలా కీలకం. ఆ నోట్ ఫైల్ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు. అధికారి నుంచి నుంచి మంత్రి, ముఖ్యమంత్రి దాకా తమతమ అభిప్రాయాలను నోట్‌ఫైల్‌లో రాస్తారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. నోట్‌ఫైళ్లను ఇవ్వకుండా తిరస్కరించవచ్చు. కొన్నిఅంశాలు రహస్యమని.. ఇవ్వలేమని చెప్పొచ్చు. అలాంటి కీలకమైన నోట్ ఫైళ్లు కూడా ఇప్పుడు మూడోకంటికి తెలియకుండా నకళ్లు తీయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిస్తే.. యథాతథస్థితి ఉంటుంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే.. ఎలాంటి ఫైళ్లనైనా అధికారికంగానే పరిశీలించవచ్చు. ఇప్పుడు కేవలం కొందరు ఉన్నతాధికారులు తమ మెహర్బానీ ప్రదర్శించేందుకే... ఫైళ్లు, సమాచార తరలింపులో నిమగ్నమయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది.