ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో బుధవారం పాల్గొ్న్న ఆయన.. పలువురు కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాపాడుకోవడంతో పాటు ఆధునికీకరించాల్సి ఉందన్నారు. కార్మికుల కష్ట ఫలితమే రాష్ట్ర సంపద అని అన్నారు. కార్మికులకు ఎల్లప్పుడూ తెదేపా అండగా ఉంటోందని చంద్రబాబు చెప్పారు. కార్మికులను దోపిడీ చేస్తే ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. చంద్రన్న బీమా ద్వారా కార్మికులకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని, త్వరలోనే ఈ మొత్తాన్ని రూ.10లక్షలకు పెంచుతామన్నారు.
డ్రైవర్ల సాధికార సంస్థను ఏర్పాటు చేసి ఆదుకుంటున్నామని గుర్తుచేశారు. అసంఘటిత కార్మికుల కోసం ఉచితంగా సొంతింటి నిర్మాణం చేపడతామని, ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. సంపద సృష్టించడంలోనూ, సంపదను పేదలకు వినియోగించడంలోనూ ముందుంటామని చెప్పారు. తాము తీసుకొచ్చిన చంద్రన్న బీమా పథకం విప్లవాత్మకమైనదని, రాష్ట్రంలో 2.57 కోట్లమందికి వర్తింపజేశామని చంద్రబాబు చెప్పారు. వీరిలో 7.77లక్షల మంది రైతుకూలీలేనన్నారు. ఈ ఏడాది 48,541దరఖాస్తులు అప్ లోడ్ చేయగా 45,416 సెటిల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దురదృష్ట వశాత్తు గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన కార్మిక, శ్రామిక కుటుంబాలవారికి చంద్రన్న బీమా పథకం వల్ల రూ.671 కోట్ల లబ్ది చేకూరిందని ముఖ్యమంత్రి తెలిపారు. గత నాలుగేళ్లలో 2.04 కోట్ల దరఖాస్తులు అప్ లోడ్ చేయగా,1.94 కోట్ల దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. (95%). చంద్రన్న బీమా వల్ల నాలుగేళ్లలో రూ.2,348కోట్ల ప్రయోజనం కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
రూ. 10కోట్లతో డ్రైవర్ల సాధికార సంస్థ నెలకొల్పుతున్నామని, ట్రాక్టర్లపై జీవిత కాల పన్ను తొలగింపు-అంగన్ వాడి, ఆశా వర్కర్లు,హోంగార్డులు,చిరుద్యోగుల వేతనాల పెంపు లాంటి నిర్ణయాలు కార్మిక సంక్షేమానికి ఉద్దేశించినవేనన్నారు. యువత ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు రాబట్టిన అంశాన్ని వివరిస్తూ గత ఐదేళ్లలో 3 పారిశ్రామిక సదస్సులు నిర్వహించామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మన రాష్ట్రానికి వరుసగా అగ్రస్థానం లభించడం తమ ప్రభుత్వ కృషేనని, ఉద్యోగులు, అధికారులు అందరూ కష్టపడటంతో రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. కియా మోటార్స్, ఇసుజి, హీరో లాంటి ఆటోమొబైల్ పరిశ్రమలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ను దేశ పారిశ్రామికాభివృద్ధిలో ధీటుగా నిలబెట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములైన కార్మిక వర్గ సంక్షేమానికి తమప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.