కేంద్ర బలగాలతో భద్రత కల్పించకపోతే తాము ఎన్నికలు నిర్వహించబోమంటూ పశ్చిమ బెంగాల్ పోలింగ్ సిబ్బంది భీష్మించడంతో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మిగతా మూడు దశల లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర బలగాలను మోహరించాలని నిర్ణయించింది. గత నాలుగు దశల ఓటింగ్ సందర్భంగా దాదాపు ప్రతి దశలోనూ పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనీ... లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ అనేక చోట్ల స్థానికులు ఆందోళనకు దిగారు. శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు తగిన భద్రత కల్పించాలంటూ ఎన్నికల సిబ్బంది సైతం డిమాండ్ చేశారు.
దీంతో మిగతా మూడు దశల ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్లో మొత్తం 600 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద శాంతి భద్రతల బాధ్యతలు కేంద్ర బలగాలే చూసుకోనున్నాయి. అవసరమైతే సాయుధ బలగాలను 700 కంపెనీలకు పెంచనున్నట్టు ఈసీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఇంత మంది కేంద్ర బలగాలను రంగంలోకి దించడం ఇదే మొటిసారి. కాగా మిగతా మూడు దశల పోలింగ్ కోసం కేంద్ర బలగాలను మోహరించడం... రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వ ప్రతిష్టకు ప్రతిఘాతంగా భావిస్తున్నారు. ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఆమె రక్షణ కల్పించలేకపోవడం వల్లే కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్టు అందరూ భావించే అవకాశం ఉంది.
మరో పక్క, పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ పోలింగ్ సందర్భంగా కేంద్ర బలగాలు వ్యవహరించిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ప్రిసైడింగ్ అధికారి పిలవనిదే పోలింగ్ కేంద్రాల్లోకి కేంద్ర బలగాలు ప్రవేశించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను మోహరించి ఓటర్లను ‘‘భయభ్రాంతులకు’’ గురిచేస్తున్నారంటూ సోమవారం టీఎంసీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కేంద్రబలగాల వైఖరి కారణంగా స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేకుండా పోయిందని ఆ పార్టీ పేర్కొంది. దీనిపై ఈసీ స్పందిస్తూ... ‘‘పోలీసులకుగానీ, కేంద్ర బలగాలకు గానీ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదు. ప్రిసైడింగ్ అధికారి వారిని పిలిస్తే, అప్పుడు మాత్రమే లోపలికి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది...’’ అని పేర్కొంది.