ఐదు రోజుల్లో పోలింగ్ జరగనున్న ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొరడా ఝుళిపించింది. ఏపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాపై వేటు వేసింది. తక్షణమే ఆయనను పోస్టు నుంచి తప్పించింది. ఎన్నికల వేళ, ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కమిషన్ వేటు వేయడం అత్యంత అరుదు. దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఏపీలో ఎన్నికల నిర్వహణలో పునేఠాకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ఎన్నికల కమిషన్ ఆయనను బదిలీ చేయడం గమనార్హం. పునేఠా స్థానంలో, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను సీఎ్‌సగా నియమిస్తూ కమిషన్ శుక్రవారం రాత్రి ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేయడంతో, ప్యానెల్ కోసం అడగకుండా, సర్వీసులో అందరికంటే సీనియర్‌గా ఉన్న ఎల్వీని సీఎ్‌సగా నియమించింది. పునేఠాను ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేని విధుల్లో ఉంచాలని, ఎల్వీ శనివారం ఉదయమే బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది.
ఎన్నికల వేళ ఏపీలో కమిషన్ జోక్యంతో జరిగిన ఆరో బదిలీ ఇది. షెడ్యూలు విడుదలైన తర్వాత నాలుగోది. ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాను, శ్రీకాకుళం కలెక్టర్‌ను బదిలీ చేసిన కమిషన్... ప్రక్రియ మొదలైన తర్వాత మరో ముగ్గురిపై వేటు వేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును మార్చాలంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో, ఆయనను ఎన్నికలతో సంబంధం లేని పోస్టుకు పంపాలని ఆదేశించిన కమిషన్, అదే ఉత్తర్వులో కడప, శ్రీకాకుళం ఎస్పీలను కూడా బదిలీ చేయాలని ఆదేశించింది. దీంతో సీఎస్ పునేఠా ఆ ముగ్గురిని బదిలీచేశారు. అయితే, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్నికల విధుల నిర్వహణలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ పాల్గొనరని, అందువల్ల ఆయన బదిలీ అవసరం లేదని ఓ వాదన తెరపైకి రావడంతో, నియమ నిబంధనలను పరిశీలించిన పునేఠా తన పాత ఉత్తర్వులను రద్దుచేశారు. వెంకటేశ్వరరావును కాకుండా ఇద్దరు ఎస్పీలను మాత్రమే బదిలీచేశారు. ఇది ఈసీ ఆగ్రహానికి కారణమైంది. తమ ఆదేశాలను ఎందుకు పాటించలేదంటూ సీఎ్‌సనుఈసీ వివరణ అడిగింది. తన చర్యను సమర్థించుకుంటూ పునేఠా పంపిన వివరణతో సంతృప్తి చెందలేదు.
ఢిల్లీ వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. రెండు రోజుల కింద పునేఠా ఢిల్లీ వెళ్లి కమిషన్ ముందు హాజరయ్యారు. ‘‘నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ చీఫ్ ఈసీ పరిధిలో లేరు. అందువల్ల అలా చేయాల్సి వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం రాకపోవడంతో ఆ వెంటనే ఉత్తర్వును సవరించుకున్నాం’’ అని వివరణ ఇచ్చారు. దీనితో కమిషన్ సంతృప్తి చెందిందనే పునేఠా భావించారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే రెండు రోజులు మౌనంగా ఉన్న ఈసీ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన పునేఠాను బదిలీ చేసింది. ‘‘సీఎస్ స్థాయి అధికారిని ఢిల్లీకి పిలిపించడమే అసాధారణ చర్య. మామూలుగానైతే సంజాయిషీ అడిగి సరిపెడతారు. కానీ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చిన తర్వాత కూడా పునేఠాపై వేటు వేయడం విస్మయం కలిగిస్తోంది’’ అని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. వైసీపీ ఇటీవల వరుసగా అధికారులను టార్గెట్ చేస్తోందనీ, పునేఠాపై నేరుగా ఫిర్యాదు చేయనప్పటికీ, ఆయన బదిలీలో ఆ పార్టీ పరోక్ష పాత్ర ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాయి.