కొన్ని రోజుల క్రితం, ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణనే, మోడీ వద్దకు పంపించని సంఘటన మరువక ముందే, ఈ రోజు మరో ఏపి బీజేపీ సీనియర్ నాయకుడుకి అవమానం జరిగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అవమానం జరిగింది. రాజమండ్రిలో జరగుతున్న మోదీ సభకు మాణిక్యాలరావుకు పాస్ అందలేదు. దీంతో ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది ఆయనను స్టేజీపైకి రానివ్వలేదు. పాస్ చూపించకపోవడం ఆయనను కిందకు దించేశారు. దీంతో వేదిక నుంచి మాణిక్యాలరావు వెనుదిరిగారు. అయితే కొద్ది సేపటి తరువాత విషయం తెలుసుకుని, పార్టీ పెద్దలు, సెక్యూరిటీతో మాట్లాడి, మళ్ళీ ఆయన్ను పైకి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు రాజమండ్రిలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు.
మరో పక్క, ఈ రోజు ఉదయం రాజమండ్రి పర్యటన సందర్భంగా మోడీ ట్వీట్ చేసారు. ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. ‘ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదు. ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నారు’అన్నారు. చివర్లో @BJP4Andhra జోడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీటుగా బదులిచ్చారు. మట్టి, నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడడానికి సిగ్గు వేయడం లేదా అని నిలదీశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. ప్రత్యేక హోదాతో ఏపీని ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాని మోదీ రాజమండ్రి పర్యటనపై సీఎం చంద్రబాబు ట్విటర్లో ప్రశ్నాస్త్రాలు సంధించారు.
రాజధాని అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మట్టి నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లడటానికి సిగ్గేయడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పాలనకు త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.