ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా, ఆదివారం రాత్రి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటిదాకా ఆస్తుల దొంగలు, జేబు దొంగలు, భూకబ్జాదారులు ఉండేవారు. ఇప్పుడు ఓట్ల దొంగలొచ్చారు జాగ్రత్త. ఓటు లేకపోతే ఎన్నికల్లేవు. ప్రతిపక్ష నేతలు మీ ఓట్లను దొంగిలిస్తున్నారు. బతికుండగానే మనుషుల్ని చంపేస్తున్నారు. బిహార్‌లో కూర్చుని ఇక్కడ ఓట్లు తీసేస్తున్నారు. మీ ఓటు తొలగించినా... మళ్లీ నమోదు చేసుకునేందుకు ఈ నెల 15 వరకూ సమయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం లేచాక ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి మీ ఓటు ఉందో లేదో చూసుకోండి. ఆ దొంగలు ఎప్పుడైనా మీ ఓట్లను కొట్టేయవచ్చు. ఈ నెల 15 అర్ధరాత్రి 12 గంటలకు ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఓటు ఉందో లేదో చూసుకోవడానికి 1950 నంబరుకు ఫోన్ చేయండి. లేకపోతే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చూడండి. ఓటే మీ ఆయుధం దాన్ని కోల్పోవద్దు. ఫారం-7ని దుర్వినియోగం చేసినవారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి డిమాండు చేస్తాం’ అని సీఎం తెలిపారు.
అధికారులు, పారిశ్రామికవేత్తల్ని జైలుకు తీసుకెళ్లిన చరిత్ర వైకాపా నాయకులదని, వాళ్ల మాయలో పడవద్దని యువతకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో... ఆర్థిక నేరాలు ఎలా చేస్తారన్న అంశానికి సంబంధించిన పాఠ్యాంశంలో జగన్ చేసిన నేరాల్ని ఒక కేస్ స్టడీగా వివరిస్తున్నారని, దాన్నిబట్టే వైకాపా నాయకులు రాష్ట్ర ప్రతిష్ఠను ఏ మేరకు దెబ్బతీశారో అర్ధమవుతుందని తెలిపారు. ‘18- 35 ఏళ్ల వయసున్న యువత ఎమోషనల్‌గా ఉంటారు. వాళ్లు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తుందో ఆ పార్టీకి అండగా ఉండాలి. వైకాపా నాయకులేదో ప్రభుత్వాన్ని తిడుతున్నారు కదా? అని వాళ్లకు ఓటు వేస్తే మీ భవిష్యత్తు అంధకారమవుతుంది’ అని పేర్కొన్నారు.
‘విభజన జరిగిన ఐదేళ్లయినా వైకాపా నాయకులు హైదరాబాద్‌లోనే ఉంటూ... లోటస్‌పాండ్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారు. వాళ్లు వ్యక్తిత్వం లేనివారు. తెరాసకు బానిసలు. మోదీ, కేసీఆర్‌లకు ఊడిగం చేస్తున్నారు. వాళ్లకు మీరు ఓటేస్తే కేసీఆర్‌కి వేసినట్టే. తెలంగాణ రూ.5వేల కోట్ల కరెంటు బకాయిలు చెల్లించాల్సి ఉండగా... మనమే రూ.2వేల కోట్లు ఇవ్వాలని ఎదురుదాడి చేస్తున్నారు’ అని మండిపడ్డారు. జగన్‌కు కేసీఆర్ ఎన్ని డబ్బులిచ్చినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తననేమీ చేయలేరన్నారు. కేసీఆర్ పన్నాగాలు తెలంగాణలో పనిచేస్తాయేమోగానీ, తన దగ్గర కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఏకపక్షమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఊడిగం చేస్తున్న జగన్, బిహార్ నుంచి పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్, వీరికి సహకారం అందిస్తున్న కుట్రదారులంతా కలిసి కులం, మతం, ప్రాంతం అన్నీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని చంద్రబాబు తెలిపారు.