ఈ రోజు నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఓట్ల తొలగింపు విషయంలో వైసీపీ ప్రమేయం ఉందని వైఎస్ జగన్ ఒప్పుకున్నారు. వైసీపీ తరపున ఫాం-7 విరివిగా ఈసీకి ఇచ్చిన మాట నిజమేనని ఆయన తెలిపారు. టీడీపీ దొంగ ఓట్లు లక్షల కొద్ది నమోదు చేయించిందని, కాబట్టే.. ఓట్లు తొలగించేలా ఫాం-7 పెట్టామన్నారు. నెల్లూరు సభలో జగన్ ఇదే మాటను స్పష్టంగా చెప్పారు. అసలు ఫాం-7 తో జగన్ కు ఏమి సంబంధం ? ఇలా చెయ్యవచ్చా ? ఒకరి ఓటు వారికే తెలియకుండా, ఇలా ఎవరూ పడితే వారు ఓట్లు తొలగించవచ్చా ? అనే వాదనలు మొదలయ్యాయి. చట్ట ప్రకారం జగన్ చేసిన పని నేరం అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు జగన్, ఈ విషయం చెప్పిన తరువాత మరో సంచలన విషయం బయట పడింది.
కొన్ని రోజల క్రితం, జగన్ బాబాయి వైఎస్ వివేకా ఓటు పోయింది అంటూ హడావిడి చేసారు. అయితే ఇప్పుడు జగన్ స్వయంగా ఒప్పుకోవటంతో, వైఎస్ వివేకా ఓటు కూడా, ఫాం-7 తో జగనే స్వయంగా తొలగించారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఇప్పటికే జగన కు, ఆయన బాబాయి , వైఎస్ వివేకా కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆస్తుల గొడవలతో పాటు, టికెట్ విషయంలో కూడా, కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒకానొక సమయంలో , వైఎస్ వివేకా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ఇప్పటికే చంద్రబాబుతో టచ్ లో ఉన్నారనే, ప్రచారం బలంగా జరిగింది. ఈ నేపధ్యంలోనే, జగన్ , ఫాం-7 ఏకంగా సొంత బాబాయి వైఎస్ వివేకా ఓటు కూడా తీయించారా అనే చర్చ కూడా మొదలైంది.
మరో పక్క, రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపు కోసం 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించేందుకు భారీగా ఫారమ్-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఈ విషయంపై సీఈసీ స్పందించారు. గత పది రోజుల్లోనే 6 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. ఓట్ల తొలగింపు కోసం వస్తున్న అక్రమ దరఖాస్తులపై కేసులు నమోదు తర్వాత ఫారం-7 దరఖాస్తులు తగ్గాయన్నారు. 9 జిల్లాల్లో క్రిమినల్, ఐటీ, ప్రజాప్రాతినిధ్య (పీఆర్) చట్టాల్లో వివిధ సెక్షన్ల కింద 45 కేసులు నమోదు చేసినట్లు ద్వివేది తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు, తూర్పు గోదావరి-14, కృష్ణా-3, గుంటూరు-1, ప్రకాశం-4, చిత్తూరు-3, అనంతపురం-1, కర్నూలు-8, విశాఖపట్నం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయన్నారు. దొంగ దరఖాస్తులకు సహకరిస్తున్న తూర్పుగోదావరి జిల్లాలోని మీసేవా సెంటర్లలో పని చేస్తున్న ఆరుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.