ప్రజారాజధాని అమరావతికి జలహారం అలంకరించనుంది. రూ.2,169 కోట్లతో కృష్ణానదిపై నిర్మించనున్న వైకుంఠపురం బ్యారేజికి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం నది ఒడ్డున బ్యారేజి నిర్మాణానికి నిర్ణయించిన స్థలం వద్దకు ముఖ్యమంత్రి ఉదయం 11.20 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పండితులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత సీఎం శాంతిహోమం నిర్వహించారు. భూమిపూజ అనంతరం సంప్రదాయ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ప్రకాశం బ్యారేజ్కి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 60 కిలోమీటర్ల దిగువన వైకుంఠపురం 3.068 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించనున్నారు. ప్రజా రాజధానిలో ఉండేవారికి తాగునీటిని పుష్కలంగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా బ్యారేజీకి 1.5 కి.మీ. సిమెంట్ వర్క్ కాగా 1.5 కి.మీ ఎర్త్ సపోర్ట్ వాల్ నిర్మాణం జరుగుతుంది. నాలుగు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకోసం రూ.3,278.60కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణపు బాధ్యతలను నవయుగ కనస్ట్రక్షన్ కంపెనీ మోయనుంది.
వైకుంఠపురం వద్ద నిర్మించబోయే బ్యారేజీ రాష్ట్రంలో ఐదోది. ప్రస్తుతం కృష్ణానదిపై శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్తోపాటు పులిచింత ప్రాజెక్టు ఉన్నాయి. గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది. తాజాగా నిర్మించబోయే వైకుంఠపురం ఐదో ప్రాజెక్టు అవుతుంది. రాజధానికి నీటి వనరులను తరలించాలంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా కెనాల్, గుంటూరు చానల్ మీదుగా మళ్లించాలి. దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లడం కంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి తరలించడం సులభం. దీన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల శాఖ అధికారులు వైకుంఠపురం దగ్గర బ్యారేజీని ప్రతిపాదించారు. ఈ బ్యారేజీ నిర్మాణం వలన 10 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. దీంతో రాజధానికి. తాగునీటితోపాటు భూగర్భజలాలు పెరుగుతాయి. అంతేగాక నదిలో నీటిమట్టం పెరగడం వలన అమరావతి ఎగువ ప్రాంతం వరకు నదిలో నీరు నిండుకుండలా దర్శనమిస్తుంది. దీంతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అమరావతిలో మరింత అభివృద్ధి చెందనుంది. వైకుంఠపురం కొండకు మరోపేరు క్రౌంచగిరి. దీనిపై అలివేలి మంగమ్మ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండడంతో క్రౌంచగిరి వైకుంఠపురంగా పేరుగాంచింది.