‘గవర్నర్లకు కొన్ని పరిమితులుంటాయి. అడ్డం పెడుతూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు’ అని మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అయిదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటు కల్పించే ఆర్డినెన్స్‌కు గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ప్రజల అవసరాల కోసం అడుగుతుంటే గవర్నర్ జాప్యం చేయడం సరికాదు. ఆయనకు ఇష్టం లేకపోతే వేరే కథ. మనం పద్ధతి ప్రకారం పనిచేస్తున్నా కావాలని కొర్రీలు పెడుతున్నారు’ అని సీఎం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఆయనకు ఎంత బాధ్యత ఉందో మనకూ అంతే ఉంది. అవసరమైతే అధికారులు వెళ్లి ఆయనకు వివరించాలి. మంత్రులను పంపిస్తాం. అప్పటికీ కాకుంటే ఆయన వ్యవహార శైలిని ప్రజలకు చెప్పాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. ‘ఒకవేళ ఆయన నుంచి ఆమోదం రాకపోతే..బిల్లు కూడా సిద్ధం చేయండి. శాసనసభలో ఆమోదించి పంపిద్దాం’ అని న్యాయశాఖ కార్యదర్శికి సూచించారు. జరిగింది ఇది... గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు పలు చోట్ల పేదలు తమకిచ్చిన ఇళ్ల స్థలాలు అమ్ముకోవడంతో ఇతరులు వాటిల్లో నివసిస్తున్నారు. నివసిస్తున్న వారికే వీటిని క్రమబద్ధీకరించడంతోపాటు పేదలు కూడా తమకిచ్చిన స్థలాలు రెండేళ్ల తర్వాత అమ్ముకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు వచ్చాయి.
మంత్రివర్గ ఉపసంఘం కూడా సిఫార్సు చేసింది. అయితే అన్నీ చర్చించి ప్రభుత్వం చివరకు, ఐదేళ్ళు చేసింది. ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపారు. దీనిపై గవర్నర్ కార్యాలయంనుంచి కొన్ని సూచనలు వచ్చాయి. అయిదేళ్లు కాకుండా 20 ఏళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుగా నిబంధనలు రూపొందించాలని చెప్పింది. ప్రస్తుతం దీనిపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ విషయం పై నిన్న కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చర్చకు రావటంతో, చంద్రబాబు ఈ విషయం పై ఆరా తీసారు. ఇంకా ఇది ఎందుకు అవ్వలేదు అని అడిగారు. దీంతో అధికారులు సమాధానం ఇస్తూ, ఇది గవర్నర్ పరిధిలోనే ఆగిపోయింది అని చెప్పటంతో, చంద్రబాబు ఫైర్ అయ్యారు.