వంగవీటి రాధాకృష్ణ విషయంలో గత కొంత కాలంగా వినిపిస్తున్న వదంతి నిజమైంది. ఎట్టకేలకు ఆయన వైకాపాను వీడారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆ పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి తాను పట్టుబడుతున్న విజయవాడ సెంట్రల్ సీటుపై వైకాపా నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. సెంట్రల్ టికెట్ విషయమై హామీ కోసం ఆయన ఏడాదికి పైగా నిరీక్షించారు. అయినా జగన్ వైపు నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. పార్టీ కోరుతున్నట్లు విజయవాడ తూర్పు లేదా బందరు పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి కనబర్చలేదు.
తొలి నుంచి ఈ ప్రతిపాదనలను ఆయన తిరస్కరిస్తూ వచ్చారు. అడపాదడపా పార్టీ పెద్దలు పలు దఫాలు బుజ్జగించినా ఆయన మెట్టు దిగలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. దీంతో బొత్సతో జరిపిన చర్చల్లో అధిష్ఠానం హామీ ఇవ్వకపోవడంతో వైకాపాకు రాం రాం చెప్పారు. వైకాపాను వంగవీటి రాధాకృష్ణ వీడడానికి ప్రధాన కారణం సెంట్రల్ నియోజకవర్గం సీటును ఆయనకు ఇవ్వకపోవడమే. దీని చుట్టూనే మొదటి నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2004లో తొలిసారిగా రాధా ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ సీటు విషయంలో జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ ఒక ఒప్పందానికి వచ్చినట్టు రాధా అనుచర వర్గం చెప్తుంది.
ఇక్కడ బీజేపీని గెలిపించటానికి, జగన్, బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇక్కడ ఐవైఆర్ కృష్ణారావును ఎమ్మల్యేగా గెలిపించే బాధ్యత జగన్ తీసుకున్నారని సమాచారం. అందుకే ఇక్కడ రాధా నుంచుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, తన మాట వినే మల్లాది విష్ణుకు ఇక్కడ సీట్ కేటాయించి, చివరి నిమిషంలో, క్యాడర్ మొత్తం ఐవైఆర్ కృష్ణారావు గెలుపుకు కృషి చేసే స్కెచ్ వేసారని, వంగవీటి వర్గం ఆరోపిస్తుంది. ఈ విషయం పై స్పష్టమైన సమాచారం ఉందని, నెక్స్ట్ బకరా మల్లాది విష్ణు అని రాధా వర్గం అంటుంది. ఐవైఆర్ కృష్ణా రావుని అసెంబ్లీకి పంపించే బాధ్యత అమిత్ షా, జగన్ కు అప్పచేప్పరని, దాని ప్రకారమే ఇప్పుడు రాధాని బలి చేసిన జగన్, రేపు మల్లాది విష్ణుని బలి చేస్తారని అంటున్నారు.