అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వ నగరాల జాబితాలో విజయవాడ చోట దక్కించుకొంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ సంస్థ గురువారం ఈ రేటింగులను విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు ముందు సంప్రదాయ వ్యాపార కూడలిగా ఉన్న విజయవాడ.. గత మూడేళ్లలోనే చాలా మారింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఇక... రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించే ప్రయత్నాలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2035 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే టాప్-10 ప్రపంచ నగరాల్లో విజయవాడకు చోటు దక్కడం విశేషం.
విజయవాడ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. రహదారులు, భూగర్భ డ్రైనేజీ, పైవంతెనలు లాంటి మౌలిక వసతులు త్వరితగతిన సమకూరుస్తున్నారు. పరిశ్రమల రాక జోరందుకుంది. ప్రధానంగా ఐటీ, పరిశ్రమలు విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే వాణిజ్య కేంద్రంగా, విద్యా హబ్‌గా ఉంది. యువతకు ఉపాధిని కల్పించే పరిశ్రమలు సైతం తరలివస్తుండటంతో.. ఇక్కడే అవకాశాలను అందుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే రెండు దశాబ్దాల కాలంలో ఏటా 8.6 శాతం చొప్పున సగటు వార్షిక వృద్ధిని సాధించబోతోంది.
విజయవాడ నగరం ప్రస్తుతం అత్యంత వేగవంతమైన పట్టణీకరణతో దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలోనూ మూడో స్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన డెమోగ్రాఫియా అంతర్జాతీయ సంస్థ రెండేళ్ల కిందట వెల్లడించింది. చదరపు కిలోమీటర్‌కు 31,200 మంది నగరంలో నివసిస్తున్నట్లు డెమోగ్రాఫియా ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరం అత్యంత కీలకంగా మారిపోయింది. పాలనా కేంద్రంగా మారడంతో ఊహించని విధంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి 2035 మధ్య నగరం ప్రగతి పథంలో సాగి.. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) గణనీయంగా పెరగబోతోంది. ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ సంస్థ నివేదిక ప్రకారం.. 2018లో 5.6 శాతం ఉన్న జీడీపీ.. 2035 నాటికి 21.3 శాతానికి పెరగనుంది.