పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై అటు కేంద్రంతో పాటు ఇటు ప్రకృతి కూడా ఇబ్బంది పెడుతుంది. గత అక్టోబరు వరకు వరద ప్రవాహం కారణంగా పనులు చేయలేకపోయారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో కాంక్రీటు పనులు చేస్తూ ‘రికార్డు’ కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రయత్నాలకు తుఫాను అడ్డంకిగా నిలిచింది. నవయుగ ఇంజనీరింగ్ సంస్థ.. ఈ నెల 16న(ఆదివారం) స్పిల్ వే, స్పిల్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్ కాంక్రీటు పనులు ప్రారంభించి 24 గంటల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయాలని నిర్ణయించిం ది. ఈ దిశగా ఇప్పటిదాకా దుబాయ్ పేరిట ఉన్న గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాలని సంకల్పించింది. మర్నాడు అంటే 17న ప్రాజెక్టు రేడియల్ గేట్ల బిగింపునకు ముహూర్తం కూడా నిర్ణయమైంది.
కాంక్రీటు పనుల్లో రికార్డు సృష్టించనున్నందున ఈ రెండు కార్యక్రమాలకు ముక్తాయింపుగా ప్రాజెక్టు ప్రాంతంలో 17న బహిరంగ సభ ఏర్పాటు చేసి.. సీఎం చంద్రబాబును ముఖ్య అతిథిగా పిలవాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. కానీ అందరి ఆశలపై ‘పెథాయ్’ తుఫాను నీళ్లు చల్లింది. తుఫాను కారణంగా ఆదివారం చేపట్టాల్సిన కాంక్రీటు పనులు వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఈ పనుల పర్యవేక్షణ కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు ప్రతినిధులనూ.. కేంద్ర జల వనరుల శాఖ అధికారులనూ.. రాష్ట్ర యంత్రాంగాన్ని నవయుగ సంస్థ అప్రమత్తం చేసింది. వాస్తవ పరిస్థితిని నవయుగ ఎండీ శ్రీధర్ శుక్రవారం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వాతావరణం సహకరించనప్పుడు ఏం చేస్తామని సీఎం వ్యాఖ్యానించారు. నెలాఖరులో గానీ, జనవరిలో గానీ కార్యక్రమం చేపట్టాలన్నారు.
ఈ ఏడాది జూన్-జూలైలో ఒకసారి అనధికారికంగా రికార్డు స్థాయిలో కాంక్రీటు పనులు చేపట్టేందుకు నవయుగ సిద్ధపడింది. ఆరోజు 11,650 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేశాక.. భారీ వర్షంతో పనులు నిలిచిపోయిన ఘటన సీఎంతో చర్చ సందర్భంగా చర్చకు వచ్చింది. తుఫాన్ నేపథ్యంలో సచివాలయ టవర్ల కోసం ఈ నెల 19న చేపట్టే భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే పనులు ఆపక తప్పదని అధికారులు, నిపుణులు అనుకుంటున్నారు. ఒకసారి గనుక ర్యాఫ్ట్ పనులు మొదలు పెడితే 3 రోజులపాటు ఆపకుండా సాగించాలి. కాబట్టి తుఫాన్ ముప్పు పూర్తిగా తొలగే వరకూ వాటిని ప్రారంభించకపోవడమే మంచిదని భావిస్తున్నారు.