ఇప్పుడంటే ప్రజా కూటమి వచ్చింది.. సొంత రాష్ట్రంలో కోదండరాం, గద్దర్, ఇటు చంద్రబాబు, అటు నుంచి రాహుల్ కేసీఆర్ చేసిన మోసాలని వివరిస్తున్నారు కాని, గత నాలుగు ఏళ్ళుగా కేసీఆర్ కు నిద్ర లేని రాత్రులు గడిపేలా చేసిన రేవంత్ రెడ్డిని మాత్రం మర్చిపోకూడదు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, రాహుల్, చంద్రబాబు సభలకు వచ్చినంత మంది ప్రజలు, రేవంత్ ప్రచార సభలకు కూడా వస్తున్నారు. అందుకే, రేవంత్ ని వీలైనంత వరకు ప్రచారానికి రాకుండా కేసీఆర్ వేసిన స్కెచ్ వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. అందుకే రేవంత్ కూడా గత రెండు రోజులుగా కోడంగల్ దాటి బయటకు రావటం లేదు. రేవంత్ ని ఎన్నికల ప్రచారంలో హత్య చేస్తారంటూ, దానికి మాజీ నక్సల్స్ ని ఉపయోగిస్తున్నారు అంటూ, లీక్ ఇచ్చారు.
దానికి తోడు రేవంత్ సెక్యూరిటీ తగ్గించారు. గతంలో ఇలాగే పరిటాల రవి విషయంలో కూడా జరగటంతో, రేవంత్ జాగ్రత్త పడ్డారు. ఇదే విషయం పై కోర్ట్ కి తెలిపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ రేవంత్‌రెడ్డికి 4+4తో భద్రత కల్పించాలని శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలంది. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంకలగకుండా భద్రతా సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొంది. తన కదలికల సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారని ఒకవేళ ఆయన ఫిర్యాదుచేస్తే, దర్యాప్తు జరిపి నివేదికను తమకు సమర్పించాలంటూ డీజీపీని న్యాయమూర్తులు ఆదేశించారు. భద్రత అంశాన్ని పట్టించుకోకుండా ముందుకెళితే ప్రాణాలు తీసేందుకూ వెనకాడేలా లేరని, అందుకే పార్టీ కార్యకర్తలు, అనుచరుల ఒత్తిడి, సూచనలతో ఎన్నికల పర్యటన వాయిదా వేసుకున్నానని రేవంత్ వెల్లడించారు.
శుక్రవారం కొడంగల్‌లోని తన నివాసంలో రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ప్రచారంలో వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేని సీఎం కేసీఆర్ నాపై కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగా నక్సల్ ఏరివేతలో సుశిక్షితులైన కొందరు పోలీసు అధికారులు, లొంగిపోయిన మావోయిస్టులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. నర్సంపేట్‌లో నాపై దాడికి వ్యూహం రచించారు. ఆ విషయమై పోలీసు వర్గాలే నాకు చెప్పాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఉన్నందున, వారి ముసుగులో దాడి చేయిస్తారనే స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే కొడంగల్ నియోజకవర్గంలోనే ఉంటున్నా. ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లు నాకు రక్షణగా లేకపోగా నా విషయాలన్నీ పోలీసు ఉన్నతాధికారులకు మోస్తున్నారు. ఇదే విషయమై పలు దఫాలుగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. పార్టీలో హోదా పెరిగితే భద్రత పెంచాలి. బదులుగా నాకు భద్రత తగ్గించారు. ఉన్నవాళ్లనూ ఇన్‌ఫార్మర్లుగా వాడుకుంటున్నారు. ఐబీ అధికారులతో నాకు ప్రమాదం పొంచి ఉంది" అంటూ రేవంత్ తెలిపారు.