తెలంగాణా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, చంద్రబాబుని ప్రధాన ప్రత్యర్ధిగా, చంద్రబాబే ఎన్నికల ఎజెండాగా మార్చేసి, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ చేస్తున్న విమర్శల దాడి పై చంద్రబాబు స్పందించారు. కొందరు రాజకీయ నాయకులు తెదేపాను విమర్శిస్తూ ప్రధాని మోదీతో లాలూచీ పడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అటువంటి పరిస్థితులను చూసే తెలంగాణలో తాము ప్రజాకూటమిలో చేరామన్నారు. కేసీఆర్‌కు తనను విమర్శించే హక్కులేదన్నారు. అనంతపురంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..
‘‘కేసీఆర్ ప్రతి రోజూ మనల్నే తిడతారు. ఎందుకు తిడతారో నాకైతే అర్థంకాలేదు. హైటెక్ సిటీ కట్టించినందుకా? హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలిపిందుకా? ఓ గొప్ప హైదరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం ఇస్తే సరిగా పాలించకుండా నన్ను విమర్శించే హక్కు మీకెక్కడిది. కేసీఆర్ తెదేపాను విమర్శిస్తూ.. మోదీతో లాలూచీ పడ్డారు. అది చూసిన తర్వాతే ప్రజాకూటమికి ఒప్పుకున్నాం. నిన్న యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణకు తెలంగాణ ఇచ్చామని, ఎక్కువ ఆదాయం ఉందని అన్నారు. ఏపీ ఆదాయం తక్కువగా ఉందని, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు’’ అని చంద్రబాబు అన్నారు.
టీ.టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో కూటమి పనితీరుపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీ టీడీపీ.. మహాకూటమిగా ఎన్నికల బరిలో నిలిచింది. మహాకూటమిలో భాగంగా తెలంగాణలో పరిమిత స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా ప్రచారం నిర్వహించనున్నారు.