అనంతలో మరో జలాశయం అందుబాటులోకి వచ్చింది. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొల్లపల్లి జలాశయాన్ని కృష్ణమ్మతో నింపగా, తాజాగా ఆ జాబితాలో మారాల జలాశయం కూడా చేరింది. అతి కొద్ది రోజుల్లోనే చెర్లోపల్లి జలాశయంలో కూడా కృష్ణమ్మ సవ్వడులు కన్పించనున్నాయి. తాజాగా మారాల జలాశయ పరిధిలో 18 వేల ఎకరాల ఆయకట్టుకి భరోసా లభించింది. ఈ జలాశయంలో కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జలహారతి ఇవ్వనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో పలు అవాంతరాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ కృష్ణమ్మను వీలైనంతగా ముందుకు తీసుకెళ్లడంలో తెదేపా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. కర్నూలు జిల్లా మల్యాల నుంచి మొదలయ్యే హంద్రీనీవా, అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయం వరకు మొదటి దశగా పేర్కొంటారు. అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది.
ఈ రెండో దశలో పెండింగ్ పనులు పూర్తిచేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2016 చివర్లో మడకశిర బ్రాంచి కాల్వపై ఉన్న గొల్లపల్లి జలాశయానికి కృష్ణమ్మను తీసుకెళ్లి నింపారు. ఇక గత ఏడాది లేపాక్షి వరకు నీటిని తరలించారు. ఈ ఏడాది మడకశిర వరకు నీటిని తీసుకెళ్లేలా చూస్తున్నారు. అలాగే హంద్రీనీవా ప్రధాన కాల్వల ద్వారా గత ఏడాది పుట్టపర్తి వరకు నీటిని తీసుకెళ్లారు. వాస్తవానికి గత ఏడాదే కృష్ణా జలాలను మారాల జలాశయనికి తీసుకెళ్లాలని భావించారు. అయితే బుక్కపట్నం మండల పరిధిలోని 9వ ప్యాకేజీలో భాగంగా 358 కి.మీ నుంచి 360 కి.మీ. వరకు 2 కి.మీ. మేర తవ్విన సొరంగం పనులు పూర్తికాకపోవడం అవరోధంగా మారింది. ఇందులో సొరంగం తవ్వుతుంటే ఎగువ నుంచి మట్టి పడిపోతుండటంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఎంతో ఇబ్బందిగా మారిన ఈ పనులను ఎట్టకేలకు ఇటీవలే పూర్తిచేసి, నీటిని ముందుకు తీసుకెళ్లగలిగారు. అలాగే ప్యాకేజీ 11లో కూడా పెండింగ్ పనులను పూర్తిచేయించారు.
మారాల జలశాయం... కృష్ణమ్మ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఎట్టకేలకు ఈ జలాశయం జలకళను సంతరించుకుంది. ఇది ప్రధాన కాల్వపై 371.040 కి.మీ. వద్ద నుంచి సమీపంలోని ఆఫ్లైన్లో ఉంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.483 శతకోటి ఘనపుటడుగులు (టీఎంసీలు) కాగా, తొలిసారిగా ఈ జలాశయాన్ని నీటితో నింపుతుండటంతో.. 0.2 టీఎంసీల మేర నీటిని నిలపాలని భావిస్తున్నారు. ఈ జలాశయ పరిధిలోని 18 వేల ఎకరాల ఆయకట్టుకి ఇక సాగు కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే జలాశయంలో నీరు రావడం మొదలవడంతో సమీప గ్రామాల రైతుల పొలాల్లోని బోర్లు రీఛార్జి అవుతున్నాయి. వెరసి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఏటా వర్షాల కోసం చూడటం, వెంటనే బెంగళూరుకు పనుల కోసం వలస పోవడం అలవాటైంది. ఇక వలసపోయే అవసరమే లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలాశయంలో 0.2 టీఎంసీల మేర నీరు నిలిచిన తర్వాత, ప్రధాన కాల్వపై ముందుకు తీసుకెళ్లి, పుంగనూరు బ్రాంచి కాల్వకు మళ్లించి, దానిపై ఉన్న చెర్లోపల్లి జలాశయానికి