మీకు మేము లక్షల లక్షల కోట్లు ఇచ్చాం, లెక్కలు చెప్పండి అంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు మనం వింటున్నాం. అయితే, కేంద్ర అధికారులు అది బూటకం అని తేల్చారు. అయితే ఈ రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే, ఇక ఏపికి ఇచ్చేది ఏమి లేదని తేల్చి చెప్పూర్. భజన చట్టం, హామీలు సరిగ్గా అమలవడం లేదని, కేంద్రం మొండి వైఖరితో ఉందని, రాష్ట్ర శాసనసభ ఆరు పేజీలతో తీర్మానం చేసి పంపించింది. దానికి కేంద్రం ఒక్క పేజీలో సమాధానం పంపింది. పాతలెక్కలతో ఒక స్టేటస్ నోట్ తయారుచేసి పంపింది.
విభజన చట్టం, హామీల ప్రకారం రాష్ట్రానికి ఇంకా ఎన్ని నిధులు రావాలి ? ఏ రకమైన ప్రయోజనాలు కలగాలి ? కేంద్రం మొండి వైఖరి వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందనే అంశాలతో అసెంబ్లీ తీర్మానం పాపంగా, ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్ని నిధులు అందాయనే విషయాన్ని కేంద్ర హోం శాఖ సమాధానంగా పంపింది. సాధారణంగా.. చేస్తాం, పరిశీలిస్తాం, త్వరలో నిర్ణయం తీసుకుంటామనే మొక్కుబడి సమాధానాలు కేంద్రం నుంచి వస్తుంటాయి. కానీ మోదీ ప్రభుత్వం బరితెగించి.. మేం చేసిందిదీ.. మీరడిగే వాటితో మాకు సంబంధం లేదన్నట్లుగా.. స్టేటస్ నోట్ తయారుచేసింది. ఇందులో కూడా ఇప్పటి వరకు అరకొరగా ఇచ్చిన నిధుల లెక్కలే తప్ప అంశాలవారీగా వివరాల్లేవు.
విభజన చట్టం, హామీలకు సంబంధించి నిధులు ఇవ్వడమే కాకుండా.. కేంద్రం తీసుకోవలసిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తన నోట్‌లో కనీసం ప్రస్తావించలేదు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రత్యేక సాయం కింద రాష్ట్రానికి ఇచ్చింది రూ.14,310 కోట్లేనని స్పష్టంగా పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా సాయం చేశామంటున్న బీజేపీ నేతల వ్యాఖ్యలు అవాస్తవాలని దీని ద్వారా నిరూపితమైంది. విభజన తర్వాత రాష్ట్రానికి రూ.16 వేల రెవెన్యూ లోటు ఉంటుందని గవర్నర్, ఏజీ, కేంద్ర కమిటీ, రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రూ.16 వేల కోట్లకుగాను ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి రూ.3,979 కోట్లు మాత్రమే అందాయి. తాజాగా పంపిన స్టేటస్ నోట్‌లోనూ ఇంకా ఇవ్వాల్సిన లోటు గురించి ఎక్కడా ప్రస్తావించనేలేదు. వెనుకబడిన జిల్లాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. దీని గురించీ స్టేటస్ నోట్‌లో సమాధానం లేదు. రాజధానికి రూ.1,500 కోట్లు ఇచ్చామని.. వెనుకబడిన జిల్లాలకు రూ.1,050 కోట్లు ఇచ్చామని, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో డ్రైనేజీల నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇచ్చామని, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,764.7 కోట్లు ఇచ్చామని అందులో పాత లెక్కలన్నీ చెప్పింది. విదేశీ రుణ సాయం (ఈఏపీలు) కింద రాష్ట్రం తీసుకున్న రుణాలకు సంబంధించి కేంద్రమే అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ నాలుగున్నరేళ్లలో రూ.15.81 కోట్ల వడ్డీ చెల్లించినట్లు కేంద్రం పేర్కొంది.