కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు గుంటూరు రానున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మీడియా సెల్ ఇన్‌చార్జి తురగా నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా నిర్మించనున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనానికి ఆయన శిలాఫలకం ఆవిష్కరిస్తారని తెలిపారు. మరో ముఖ్యఅతిథిగా పార్లమెంట్ సభ్యుడు, జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వినోద్ సోంకార్ కూడా హాజరుకానున్నారని తెలిపారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తారన్నారు. ఈసందర్భంగా గుంటూరు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద జరగనున్న ఎస్సీ మోర్చా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సునీల్ ప్రమాణ స్వీకారోత్సవ బహిరంగ సభలో వీరు పాల్గొంటారని నాగభూషణం వివరించారు.

rajnath 16102018 3

అయితే ఈ సంధర్బంలో, తెలుగుదేశం నేతలు ఆయన్ను కలవనున్నారు. ‘తిత్లీ’ బాధితులకు సాయంచేయాలని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను టీడీపీ నేతలు ఈరోజు సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో కలవనున్నారు. ‘తిత్లీ’ తుపాను సాయం విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని నేతలు కోరనున్నారు. అంతేకాక విభజన హామీలు అమలు చేయాలని వినతిపత్రం ఎంపీలు వినతి పత్రం ఇవ్వనున్నారు. కేంద్రహోంమత్రిని ఎంపీలు కేశినేని నాని, శ్రీరాం మాల్యాద్రి, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కలువనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గుజరాత్ రావలిసిందిగా, గుజరాత్ ముఖ్యమంత్రి ఆహ్వానం పంపారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహావిష్కరణకు హాజరుకావాలని కోరుతూ గుజరాత్‌ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆ రాష్ట్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆర్‌సీ ఫల్దు సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దేశవ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు ఫల్దు విలేకరులకు వెల్లడించారు. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందించినట్లు చెప్పారు.

cbn 16102018 2

గుజరాత్‌లోని నర్మదా నదితీరంలో ఈ నెల 31న జరిగే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడకు చంద్రబాబు వెళ్తారా, ప్రతినిధిని పంపిస్తారా అనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు తరుచూ పటేల్ విగ్రహానికి ఇచ్చినన్ని డబ్బులు కూడా అమరావతికి ఇవ్వలేదు అంటూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో ఈ విగ్రహం ఏర్పాటవుతోంది. దీని ఎత్తు 182 మీటర్లు.. అంటే 600 అడుగులు. చైనాలోని ‘స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ’ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 128 మీటర్లు.

cbn 16102018 3

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన ప్రాజెక్టుగా పరిగణిస్తున్న ఈ విగ్రహం తయారీకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం దాదాపు రూ. 2,990 కోట్లు. ఐక్యతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)గా పిలుస్తున్న దీన్ని అక్టోబర్ 31వ తేదీన మోదీ ఆవిష్కరించనున్నారు. నిర్ణీత గడువులోపు ఈ విగ్రహ తయారీ పనులు ముగించేందుకు 2500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. చైనా నుంచి వచ్చిన వందల మంది వలస కార్మికులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు.

భయంకర తిత్లీ తుఫాన్ ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.2800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తక్షణమే స్పందించి రూ.1200 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. అలాగే బాధితులను ఆదుకోవడానికి పెద్ద మనసుతో ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందజేయాలని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు కోరారు. సీఎం పిలుపుతో స్పందించి నటుడు సంపూర్ణేష్ బాబు ముందుకొచ్చారు. సినీ పరిశ్రమ నుంచి మొదటిగా ఆయనే రూ.50 వేలు సాయం అందించారు.

lokesh 161021018 2

ఆ తరవాత విజయ్ దేవరకొండ తన వంతుగా రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ ముందుకొచ్చారు. వీరంతా సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు సాయాన్ని అందించారు. ఎన్టీఆర్ అత్యధికంగా రూ.15 లక్షలు ప్రకటించారు. కళ్యాణ్ రామ్ రూ.5 లక్షలు, వరుణ్ తేజ్ రూ.5 లక్షలు ఇచ్చారు. మరో పక్క మంచు మనోజ్, హీరో నిఖిల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, కోన వెంకట్ కూడా సహాయం చేసారు. తుఫాను బాధితుల్ని ఆదుకోవటానికి వచ్చిన వీరందిరినీ పేరు పేరునా, లోకేష్ ట్విట్టర్ లో ధన్యవాదాలు చెప్పారు. ఇంత కష్ట కాలంలో ఆదుకున్నందుకు, ఏపి ప్రజల తరుపున ధన్యవాదాలు చెప్పారు.

lokesh 161021018 3

కాగా, తిత్లీ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు, ప్రజలకు పరిహారం అందజేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీడిమామిడికి హెక్టారుకు రూ.25వేలు పరిహారం చెల్లించాలని సీఎం నిర్ణయించారు. అలాగే కూలిపోయిన ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1200 ఇవ్వనున్నారు. బోటు కోల్పోయిన మత్స్యకారులకు రూ.2లక్షలు పరిహారం, పూర్తిగా ధ్వంసమైన మోటారు బోట్లకు రూ. 6 లక్షలు అందిస్తున్నారు. ఆక్వా కల్చర్‌కు రూ.30వేలు పరిహారం.. పశువుల శాలల నిర్మాణానికి రూ. లక్ష ఇస్తున్నారు. ధ్వంసమైన ఇళ్లకు రూ. 10 వేలు పరిహారంగా చెల్లిస్తున్నారు. ఇక పూర్తిగా ఇల్లు ధ్వంసమైతే.. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద రూ.1.5 లక్షలు విలువచేసే కొత్త ఇంటిని నిర్మించి ఇస్తారు.

ఐటీ అధికారుల వేధింపులకు ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని సనత్‌నగర్‌కు చెందిన సాధిక్ 25 ఏళ్లుగా విజయవాడలోని జవహర్ ఆటోనగర్‌లో లారీలకు బాడీ బిల్డింగ్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జీఎస్టీ అమల్లోకి రాకముందు వరకు ఈ వృత్తి చేతి వృత్తుల్లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ తయారయ్యే ప్రతీ వస్తువుపై జీఎస్టీ విధిస్తున్నారు. సాధిక్ కొద్దినెలలుగా ఐటీరిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఆ శాఖ అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన ఓ చాటెడ్ అకౌంటెంట్‌ను ఆశ్రయించారు.

tax 16102018 2

జీఎస్టీ నుంచి మినహాయింపు పొందేలా రిటర్న్స్ రూపొందించారు. బాడీ బిల్డింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న ఐదారుగురు కార్మికులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు చూపించారు. ఐటీ అధికారులు ఈ ఐదుగురిని విచారించగా వారు కార్మికులే అని తేలింది. దీంతో సాధిక్‌కు ఐటీ అధికారులు రూ.50లక్షల జరిమానా విధించారు. ఐటీ అధికారులను వేడుకోగా రూ.15 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామన్నారని సాధిక్ సహచరులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారుల నుంచి ఫోన్లు ఎక్కువవడంతో సాధిక్ ఒత్తిడికి లోనయ్యాడు. ప్రార్థన మందిరానికి వెళుతున్నట్లు ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో చెప్పి బయలుదేరి తిరిగి రాలేదు.

tax 16102018 1

ఆందోళనకు గురైన కుటుంబీకులు సోమవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి ఎనిమిదింటి ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని కరువు కాల్వలో తోట్లవల్లూరు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి తోట్లవల్లూరు కాల్వలో సాధిక్ మృతదేహం తేలింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు సాధిక్‌కు జీఎస్టీ నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని జీఎస్టీ ఉన్నతాధికారులు తెలిపారు. తమ జాబితాలో సాధిక్ పరిశ్రమలేదని, నోటీసులతో తమకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. సాదిక్‌ ఆత్మహత్యకు ఆదాయ పన్ను శాఖ అధికారులే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అధికారులు తమకూ కొంత డబ్బు ఇవ్వాలని సాదిక్‌ను డిమాండ్‌ చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Advertisements

Latest Articles

Most Read