తిత్లీ తుపానుతో నష్టపోయిన రైతులకు, బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం ప్రకటించారు. తుఫాను, వరదల కారణంగా మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం. బాధితులకు తక్షణమే 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, లీటర్ పామెలిన్ ఆయిల్, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లి, అరకిలో పంచదార! మత్స్యకారులకు నిత్యావసరాలతోపాటు 50 కేజీల బియ్యం. తుఫాను, గాలి బీభత్సానికి దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు పరిహారం. అరటికి హెక్టారుకు రూ.30 వేలు, కొబ్బరితోటలు హెక్టారుకు రూ.40వేలు నష్ట పరిహారం. ఒక్కో కొబ్బరిచెట్టుకు రూ.1200 చెల్లింపు. చెట్లను తొలగించే బాధ్యత ఉద్యానవన శాఖ, ఫైర్ సర్వీసు విభాగానికి అప్పగింత.
జీడిమామిడికి పంట నష్టం కింద హెక్టారుకు రూ.25వేలు చెల్లింపు. కొత్తగా మొక్కలు నాటి, మూడేళ్లపాటు నిర్వహించేందుకు హెక్టారుకు రూ.40వేలు! కొబ్బరి, జీడిమామిడి సాగుచేస్తున్న పెద్ద రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ వర్తింపు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు రూ. లక్ష. కొత్త బోట్లు, వలలపై 50% సబ్సిడీ. వలలు కోల్పోయున వారికి రూ.10వేలు. మరబోట్లు కోల్పోయిన వారికి రూ.6 లక్షలు పరిహారం. ఆక్వా రైతులకు హెక్టారుకు రూ.30వేలు పరిహారం.
చనిపోయిన, వైకల్యం పాలయిన గేదెలు, ఆవులకు రూ.30 వేలు చొప్పున... మేకలు, గొర్రెలు మరణిస్తే ఒక్కోదానికి రూ.3 వేలు చొప్పున పరిహారం. పశువుల పాకలు దెబ్బతింటే రూ.10 వేలు, కొత్తగా నిర్మించుకునేందుకు ఉపాధి హామీ కింద రూ.లక్ష. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు చెల్లించాలి. పూర్తిగా ధ్వంసమైతే రూ.లక్షన్నర పరిహారం లేదా అంతకుపైన నష్టం జరిగి ఉంటే ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద కొత్త ఇల్లు మంజూరు.
ఈ హామీలు, ఆదేశాలను తక్షణమే అమలు చేసేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలంటూ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కోరారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు ఆయన ఆదివారం లేఖ రాశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలకన్నా పరిహారం కాస్త ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం హామీల అమలుకు విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్ర విపత్తు స్పందన నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్) విడుదల, మార్గదర్శకాలకు ప్రత్యేక ఉత్తర్వులు తాజాగా జారీ చేయాల్సి ఉంది. అదే సమయంలో కేంద్ర విపత్తు సహాయ నిధి(ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి కూడా నిధులు కోరాల్సి ఉంది. మన్మోహన్‌సింగ్ సోమవారం సచివాలయంలో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది.