ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖా మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తన పనితీరు, శాఖలను ప్రగతిపథంలో పయనింపజేస్తున్న మంత్రి ఇప్పటికే చాలా అవార్డులు అందుకున్నారు. ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఇటీవలే చైనాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ చాంపియన్ వార్షిక సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానం అందుకుని హాజరయ్యారు. తాజాగా ఓ అరుదైన అవకాశం కల్పిస్తూ సింగపూర్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సింగపూర్ 6వ అధ్యక్షుడిగా పనిచేసిన ఎస్ ఆర్ నాథన్ పేరుతో, ఆయన సేవలను స్మరిస్తూ ఏర్పాటు చేసిన ఎస్ ఆర్ నాథన్ ఫెలోషిప్‌కు మంత్రి నారా లోకేష్‌ని ఎంపిక చేశామని సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి వివియన్ బాలకృష్ణన్ పంపిన లేఖలో పేర్కొన్నారు.
సింగపూర్‌కి 6వ అధ్యక్షుడిగా, అత్యధిక కాలం సేవలు అందించి..ప్రజాసేవకు జీవితం అంకితం చేసిన ఆధునిక సింగపూర్ నిర్మాతలలో ఒకరైన ఎస్ఆర్ నాథన్‌ను సేవలను స్మరిస్తూ 2012 నవంబర్‌లో ఈ ఫెలోషిప్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకూ వియత్నాం డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వూ వాన్ నిన్(vu van ninh ),గవర్నర్ ఆఫ్ జెజు ప్రోవెన్స్ వొన్ హీ రైయాంగ్(won hee-ryong) ఈ అరుదైన గౌరవం అందుకున్న వారిలో ఉన్నారు. రాజకీయాలు, ప్రభుత్వపాలన, ఆర్థిక వ్యవస్థ, వ్యాపార వాణిజ్యం, సమాజం, కళలు, సంస్కృతి, మీడియా వంటి రంగాలకు సంబంధించి వస్తున్న మార్పులు..సమాజ దృక్పథం ఆధునిక కాలంలో సమాజం అవసరాలు వంటి అంశాలపై సింగపూర్ నాయకులు,అధికారులతో జరిగే చర్చల్లో భాగంగా చర్చించనున్నారు.
ఈ ఫెలోషిప్ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగుతుందని, దీనిలో భాగంగా ఏడాదిలో ఒక వారం పాటు సింగపూర్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర రంగాల ప్రముఖులను కలిసి ఫెలోషిప్‌లో పొందుపరిచిన అంశాలను చర్చించేందు అవకాశాలు కల్పిస్తారు. దీంతో పాటు ఫెలోషిప్‌కి ఎంపికైన అతిథికి సంబంధించిన ఆతిధ్యం సింగపూర్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి ఆహ్వానంలో పేర్కొన్నారు. డిసెంబర్ చివరి వారంలో సింగపూర్ పర్యటన లో మంత్రి నారా లోకేష్ ఫెలో షిప్ అందుకొనున్నారు.