తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దని, రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలని తాను ఎన్నోసార్లు చెప్పానని చంద్రబాబు తెలిపారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రాగానే టీఆర్‌ఎస్ వైఖరి మారిపోయిందన్నారు. తెలుగుజాతి కోసం కలిసుందామని టీఆర్‌ఎస్‌ను చాలా సార్లు కోరామని చంద్రబాబు పేర్కొన్నారు. మొన్నటి వరకు హోదాకు సహకరించిన టీఆర్ఎస్, ఎన్డీఏతో విడిపోగానే ఆ పార్టీ వైఖరి మారిందన్నారు. ఎప్పుడైతే ప్రధాని మోదీతో తాము విభేదించామో, అప్పటి నుంచి టీఆర్ఎస్ తమతో విభేదించడం మొదలు పెట్టిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిన టీఆర్ఎస్... ఆ తర్వాత మాట మార్చిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్ని పార్టీలు చెప్పినా.. ఇవ్వడానికి బీజేపీకి అభ్యంతరం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుండగా... కేంద్రం మాత్రం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర విభజన జరిగిపోయింది. తెలుగు వాళ్లం సోదరులుగా విడిపోయాం. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఇద్దరినీ కూర్చోబెట్టి... అన్యాయం జరిగితే చక్కదిద్దాలి. కానీ, ప్రధాని ఈ పని చేయకపోగా రెండు రాష్ట్రాల మధ్య తగవులు పెట్టాలని చూశారు’’ అని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉందన్నారు. రాజకీయ సుస్థిరత కోసం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలు చేయలేదన్నారు. విభజన హామీల్లో 90 శాతం అమలు చేసినట్లు కేంద్రం, బీజేపీ నాయకులు చెబుతున్నారని... ఇలా అవాస్తవాలతో ఎవరి చెవిలో పూలు పెడతారని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రం కోసం, ప్రజల కోసం తాను రైట్ టర్న్ తీసుకున్నానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రధాని స్థాయి వ్యక్తి యూటర్న్ అని మాట్లాడటం సరైనదేనా అని ప్రశ్నించారు. అవిశ్వాసం తీర్మానం రోజు నాటికి వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి బయటికొచ్చారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడరు, టీడీపీని మాత్రం ప్రశ్నిస్తారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తనను యూటర్న్ తీసుకున్నాని అంటారా?, తమపై కోపం ఉండొచ్చు కానీ.. ప్రజలు ఏం చేశారన్నారు. ప్రజలు పన్నులు కట్టడం లేదా? అని సీఎం ప్రశ్నించారు. రహస్య అజెండాను అమలు చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తిప్పికొడతారన్నారు. తాను ఏ తప్పుచేయలేదని.. చేయనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.