బాబ్లీ ప్రాజెక్టు పై ఆందోళన చేసిన ఎనిమిదేళ్లకు వారెంట్లు ఇవ్వటం, ఆ నోటీసులతో తమకు సంబంధం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్తూ ఉండటంతో చంద్రబాబు ఈ విషయం పై నిన్న స్పందించారు. 8 ఏళ్ళ నాటి కేసుకి ఇప్పుడు నోటీసులు ఏంటి ? అమిత్ షా చెప్పే మాటలకు అర్ధం ఎమన్నా ఉందా ?ఇప్పుడు మహారాష్ట్రలో, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీని ప్రశ్నించారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా నిన్న ఉండవల్లిలో కొండవీటి వాగు వరదనీటి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కృష్ణా నదికి హారతి ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.
‘‘బాబ్లీ విషయంలో నేనేదో డ్రామాలు చేస్తున్నానంటున్నారు. ఆ అవసరం నాకు లేదు. ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ఆరోజు బాబ్లీ వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందనే ఆందోళనకు దిగాం. ప్రజా సమస్యలపై పోరాడితే ఎప్పుడూ లేనిది ఆ కేసును పైకి తీసుకొచ్చి మా మీదే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ సోమవారం అసెంబ్లీలో వస్తాయి. అన్నీ అక్కడ మాట్లాడుకుందాం’’ అంటూ అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతనని కూడా చూడకుండా మహారాష్ట్ర పోలీసులు మూడు రోజులపాటు ఇబ్బంది పెట్టారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల నుంచి తలెత్తిన ప్రతిఘటన చూసి ప్రత్యేక విమానంలో తమను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వదిలి పెట్టారన్నారు.
‘‘ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపైనా పోరాడాను. అప్పుడు అధికారంలో ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఐదు రాష్ట్రాల సీఎంలతో కమిటీ వేయించి న్యాయం జరిగేలా చూశాను. ఆ తర్వాత వచ్చిన సీఎంలు సరైన వాదనలు వినిపించకపోవడంతో ఇప్పుడు కృష్ణా నది నీరు దిగువకు రాక ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతోంది’’ అని చంద్రబాబు తెలిపారు. దీంతో అసెంబ్లీలో బాబ్లీ విషయంలో ఎందుకు పోరాడాల్సి వచ్చింది వివరిస్తూ, 8 ఏళ్ళ తరువాత నోటీసులు రావటం, వీటి వెనుక దాగి ఉన్న కుట్ర, మొత్తం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చెప్పనున్నారు. అమిత్ షా చెప్తున్న అబద్ధాలకు అసెంబ్లీలోనే చంద్రబాబు సమాధానం చెప్పనున్నారు.