భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ అక్టోబరు మూడోతేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగాయ్‌ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నియమించారు. 2019 నవంబరు వరకూ గొగొయ్ ఈ పదవీబాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ అత్యున్నత పదవిలో నియమితులైన ఈశాన్యరాష్ట్రాలకు చెందిన తొలి న్యాయమూర్తి ఆయనే అవుతారు. ప్రస్తుత చీఫ్‌జస్టిస్ దీపక్ మిశ్ర తన వారసుడిగా గొగాయ్‌ను పేర్కొంటూ ప్రభుత్వానికి సిఫారసు పంపిన దాదాపు వారం రోజుల తర్వాత ఈ నియామకం జరిగింది.
జస్టిస్ దీపక్ మిశ్ర అక్టోబరు ఒకటో తేదీన పదవీవిరమణ చేయనున్నారు. రెండోతేదీన గాంధీజయంతి సందర్భంగా సెలవు. దీంతో, మూడోతేదీన జస్టిస్ గొగొయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తారు. 1954 నవంబరు 18న జన్మించిన గొగొయ్ 1978లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. గువాహటి హైకోర్టులో ప్రాక్టిస్ చేశారు. 2001లో గువాహటి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. 2011లో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012లో సుంప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.
జస్టిస్ గొగొయ్‌కి న్యాయమూర్తిగా ఎంతో నిష్కర్షగా వ్యవహరిస్తారనే పేరుంది. ఈ ఏడాది జనవరిలో చీఫ్‌జస్టిస్. దీపక్ మిశ్రకు వ్యతిరేకంగా అత్యంత అరుదైన రీతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి విమర్శించిన నలుగురు న్యాయమూర్తులో జస్టిస్.గొగొయ్ కూడా ఉన్న విషయం గమనార్హం. ఇప్పుడున్న చీఫ్‌జస్టిస్ దీపక్ మిశ్ర, మోడీ-షా లకు అనుకూలం అనే ప్రచారం ఉంది. దీపక్ మిశ్ర పదవీ కాలం పొడిగించాలని, ఎన్నికలు అయ్యే దాక ఆయన్ను ఉంచటానికి ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం కూడా ఉంది. కాని అవి ఫలించక పోవటం, నిబంధనలు ప్రకారం, జస్టిస్ గొగొయ్ ని నియమితులు కావటం జరిగిపోయాయి. అయితే, ఈయన నిమాకంతో, కేంద్రం దూకుడుకు అడ్డు పడుతుందని, జస్టిజ్ లోయా హత్య కేసు లాంటివి మళ్ళీ రీ-ఓపెన్ అయ్యే అవకాసం కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది.