2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఈ వారెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం తదితర పరిణామాలు ఇందుకు కారణంగా, ఇది రాజకీయ కక్షగా కొందరు భావిస్తున్నారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఏకంగా అరెస్టు వారెంటు జారీ కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఒకో పావును కదుపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందని టీడీపీ ముఖ్యలు అనుమానిస్తున్నారు.
బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనకు సంబంధించి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారెంట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు, మహారాష్ట్ర పోలీసులను సైతం దిక్కు తోచని స్థితిలో పడేసింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మహారాష్ట్ర, నాందేడ్ పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేస్తే పరిణామాలు అదుపుతప్పే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును విచారించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఐరాస సమావేశంలో ప్రసంగించేందుకు చంద్రబాబు 23న అమెరికా వెళ్తున్నారు. సరిగ్గా దీనికి రెండు రోజుల ముందు కోర్టులో చంద్రబాబు బృందాన్ని హాజరు పరచాలని వారెంటు జారీ కావడం.. ఆయన్ను అందులో పాల్గొనకుండా చేసేందుకేనని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చ నడుస్తోంది. వారెంటు అమలు కాకుండా పైకోర్టు నుంచి ఆదేశాలు పొందవచ్చని కొందరు చెబుతుండగా, నేరుగా కోర్టుకు హాజరైతే బాబ్లీ కోసం గతంలో చేసిన పోరాటం అందరికీ మరోసారి తెలుస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి కేసుల్లో కోర్టుకు హాజరయ్యారా... దాని వల్ల తర్వాతి పరిణామాలు ఎలా ఉన్నాయన్నదానిపై పార్టీ వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి.