బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించిన టీడీపీ అధినేత, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ల జారీ వెనుక బీజేపీ కుట్ర ఉందన్న ఆరోపణలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో టీడీపీ ధర్నా చేపట్టిన సమయంలోను, కేసు పెట్టినప్పుడు మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని తెలిపారు. అలాంటి కుట్రలు చేసిన కాంగ్రె్‌సతోనే ఇప్పుడు కూటమి కట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసలు మాకు ఇలాంటి పనులు చేసే అలవాటు లేదని, మేము ఎవరి పైనా కక్ష సాధింపు చెయ్యమని చెప్పారు.
శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో షా విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు తనపై కేసు పెట్టిన పార్టీతో కలిసి ఇప్పుడు తెలంగాణలో ఓట్లు అడగడానికి వెళ్తున్నారు. బాబ్లీ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. 2013లో చార్జిషీటు దాఖలైనప్పుడు కూడా కాంగ్రెసే అధికారంలో ఉంది. అప్పటి నుంచి 25 సమన్లు జారీ అయ్యాయి. అయినా ఆయన వెళ్లలేదు. కోర్టు తన పని తాను చేసుకుపోతుంది. కేవలం ప్రజల నుంచి సానుభూతి పొందడానికే.. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా తెలుగు ప్రజలకు తెలుసు. కేసు దేనికి సంబంధించింది.. ఓట్లు ఎవరికి వేయాలో వారికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
అయితే అమిత్ షా వ్యాఖ్యల పై, ఈ రోజు చంద్రబాబు స్పందించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎస్సార్‌ఎస్పీ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు కట్టారని, ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని పోరాటం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. బాబ్లీ విషయంలోనే కాదు.. ఆల్మట్టి ఎత్తు పెంపులోనూ పోరాడానని చెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు అరెస్ట్ వారెంట్ అంటున్నారని, వారెంట్ల విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారని, కేంద్రం, మహారాష్ట్రలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఏ నోటీస్ ఇవ్వకుండా, ఇప్పటికిప్పుడు కేసు తిరగదోడి, ఇలాంటి పనులు చెయ్యటం ఏంటని ప్రశ్నించారు. డ్రామాలు ఆడాల్సిన అవసరం తనకు లేదని, బ్యాంకు దోచేసినవాళ్లని విదేశాలకు పంపిస్తారని చంద్రబాబు ఆరోపించారు.