ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి ఒక్కొకరి పని తీరు పై ఆరా తీస్తున్నారు. వారి ప్రోగ్రెస్ రిపోర్టులను చూపించి ఏకరువుపెడుతున్నారు. ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా లేనిపోనివి కల్పించి చెప్పబోతే నిజంగా ఏమి జరిగిందో చెప్పండంటూ, మీ గురించి నా దగ్గర స్పష్టమైన డాటాని ఉందంటూ, అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలని వారికి సూచించారు. తనకు అందిన అయిదు సర్వేల నివేదికల నుంచి నివేదిక తీసుకొని సదరు ఎమ్మెల్యేలని ముఖాముఖీ కడిగేస్తున్నారు చంద్రబాబు. దీంతో సదరు ఎమ్మెల్యేలకు గొంతులో వెలక్కాయపడుతోంది.
ఒక్కొక్క ఎమ్మెల్యేలతో, సీఎం సుమారు పదిహేను నిముషాల సేపు మాట్లాడుతున్నారు. వారి వారి నియోజకవర్గంలో పార్టీ ఉన్నపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఎమ్మెల్యే పనితీరును ప్రస్తావిస్తూ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకు ఎవరితోనన్నవిభేదాలు ఉన్నాయా ప్రశ్నించారు. ఇటీవల కోస్తా జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యే బాబుతో ముఖాముఖికి వెళ్లారు. ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పని తీరును 76 శాతం మంది మెచ్చుకోగా, ఎమ్మెల్యే పనితీరుపై కేవలం 22 శాతం మందే సంతృప్తిగా ఉన్నారన్న నిర్ధిష్ట సమాచారం సీఎం వద్ద అప్పటికే ఉంది.
దీని పై ఆ ఎమ్మెల్యేని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే కొద్దిసేపు ఆశ్చర్యపోయి తన నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వంపైనే వ్యతిరేకత ఉందని దబాయించే ప్రయత్నం చేశారు. వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పై వ్యతిరేఖత ఉంటే నా పనితీరు పై 76 శాతం మంది ప్రజలు ఎలా సంతృప్తి వ్యక్తంచేస్తారని నిలదీశారు. నువ్వు నీ నియోజకవర్గంలో ఉండకుండా హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నావు' అని సీఎం ప్రశ్నించారు. దీంతో ఆ ఎమ్మెల్యే బిత్తరపోయారు. అంతే కాకుండా పార్టీ క్యాడర్‌తో ఉన్న విభేదాలపై కూడా బాబు ఆ ఎమ్మెల్యే కు షాక్‌లు ఇచ్చారు.
చంద్రబాబు సీరియస్ అవ్వడంతో ఆ ఎమ్మెల్యేకి తత్త్వం బోధపడింది. "వ్యాపార పనుల నిమిత్తమై నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లాను'' అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. "వ్యాపారం చేయవద్దని నేను చెప్పడం లేదు, కానీ నియోజకవర్గంలో ఎందుకు ఉండటం లేదు'' అని చంద్రబాబు మరోసారి గట్టిగా ప్రశ్నించారు. "నీకంటే పెద్ద వ్యాపారవేత్తలే పార్టీలో ఉన్నార''ని గుర్తుచేస్తూ ఆయా నేతల పేర్లను కూడాప్రస్తావించారట. ఈ తరుణంలో చంద్రబాబు ముఖాముఖి భేటీలకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. గతంలో పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలకి కూడా సీఎం చంద్రబాబు గట్టి చురకలు అన్తిస్తున్నారట.
ఉదయాన్నే ఇంటికి వచ్చే ప్రజలను వెయిట్ చేయింఛి, తొమ్మిదిన్నర వరకు బయటకు రాకపోవడం వంటి విషయాల పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా పార్టీ నేతలతోనూ, ఎంపీలతోనూ ఉన్న విభేదాలను కూడా పక్కనపెట్టి పార్టీ విజయాన్ని వన్‌సైడ్ చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగానే సూచిస్తున్నారు. ఈ సారి సుమారు 30 నుంచి 40 మంది సిట్టింగ్‌లకు ఈసారి టిక్కెట్లు ఉండవని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ భేటీలలో చంద్రబాబు విప్పుతున్న రాజకీయగుట్టు ఎమ్మెల్యేలకు చెమటలు పట్టిస్తోంది. చూద్దాం ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందో లేదో...