అంతర్జాతీయ స్థాయిలో మరో వేడుక నిర్వహణకు విశాఖపట్నం వేదిక కాబోతుంది. నగరంలో ఏర్పాటవుతున్న మెడ్‌టెక్ జోన్‌లో డిసెంబరు 13 నుంచి 15వ తేదీ వరకు 4వ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) విశ్వ వైద్య పరికరాల సదస్సు(గ్లోబల్ మెడికల్ డివైజ్ ఫోరమ్) జరగనున్నట్లు మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు 194 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు వచ్చే అవకాశముందని వివరించారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు వ్యాధులపై ఎన్నో సాంకేతిక పరిష్కారాలతో ముందుకొస్తోందని, ఈ సదస్సు ద్వారా మరింత ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వైద్యపరికరాల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘మెడ్‌టెక్ జోన్’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో 270 ఎకరాల్లో నిర్మించనున్న దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ పార్కు (మెడ్‌టెక్ జోన్)కు 2016లో చంద్రబాబు శంకుస్థాపన చేసారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఏకంగా, ఇక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయి సదస్సు జరుగుతుంది. ఇది చంద్రబాబు సత్తా.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్(ఏపీ మెడ్‌టెక్ జోన్) పేరుతో తయారైన ఈ పార్కుకు ఏపీ ప్రభుత్వం 275 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ వైద్యపరికరాలను తయారు చేసే పరిశ్రమలకు భూమిని కేటాయించి, మౌలిక వసతులు కల్పించింది. 200కుపైగా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు మొదలయ్యాయి. సూది నుంచి స్కానింగ్ యంత్రం వరకు అన్నీ ఇక్కడే తయారయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇక్కడి నుంచి విదేశాలకూ వైద్యపరికరాలను ఎగుమతి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.