పారిశ్రామకవేత్తలు, అందునా బిజినెస్ టైకూన్ లాగా పేరు ఉన్న టాటాలు, అంబానీలు, రాజకీయ నాయకులతో అంతగా, బహిరంగగా కనిపించటానికి ఇష్టపడరు. దానికి అనేక కారణాలు ఉంటాయి అనుకోండి. కాని చంద్రబాబు విషయంలో మాత్రం అలా కాదు. ఎంత పెద్ద బిజినెస్ టైకూన్ అయినా, చంద్రబాబుకి ఇచ్చే గౌరవం వేరు. అంబానీ లాంటి వాడు, ముంబై నుంచి అమరావతి వచ్చి, చంద్రబాబుతో ఒక పూట ఉన్నారు అంటేనే, ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు, ముంబైలో పర్యటన చేస్తున్న చంద్రబాబుకి, కార్పొరేట్ సెక్టార్ రెడ్ కార్పెట్ పరిచింది. ముఖ్యంగా, బిజినెస్ టైకూన్ రతన్ టాటా, చంద్రబాబుని కలిసినప్పుడు, ఆయన చూపించిన గౌరవం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
చంద్రబాబుకి ఎదురొచ్చి, తన ఛాంబర్ కి స్వయానా తీసుకువెళ్ళారు రతన్ టాటా. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకులు ఇచ్చే గౌరవం ఇది. రతన్‌టాటా, టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్, ఇద్దరూ కలిసి చంద్రబాబుకి ఎదురు వచ్చి, మీటింగ్ కి తీసుకువెళ్ళారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. అంతేకాకుండా టాటా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను బాబు సందర్శించారు. మహిళా సాధికారత ప్రాజెక్టు వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఏపీలో హోటల్ డెవలప్‌మెంట్‌కు టాటా గ్రూప్ సహకరించాలని, విజయవాడ-సింగపూర్ మధ్య విమానాలు నడపాలని ఆయన కోరారు. అమరావతిలో ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని, విజయవాడ, విశాఖలో స్టార్‌బక్స్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ప్రజా రవాణ వ్యవస్థలో టాటా గ్రూప్ సాంకేతిక సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. టాటా గ్రూప్ సామజిక పరంగా చేపట్టిన మహిళా సాధికారత వంటి ప్రాజెక్టులను టాటా అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో హోటల్, పర్యాటక శాఖ, ఎలక్ట్రికల్ బస్సు రవాణా వంటి రంగాల్లో భాగస్వామ్యం కావలసిందిగా ముఖ్యమంత్రి టాటా గ్రూప్ ను ఆహ్వానించారు. ఈ మీటింగ్ అయిపోయిన తరువాత, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ఆవాసయోగ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రంలో మొబైల్ తయారీని 25 నుంచి 50 శాతానికి పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు సమావేశంలో తెలిపారు. పర్యాటక రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వేత్తలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.