అమరావతి అంటే ఎలేర్జీ... పట్టిసీమ అంటే దండగ... ఇలాంటే స్టేట్మెంట్లు ఇచ్చి, రాజధాని రెండు జిల్లాల్లో అభ్యర్ధులు లేకుండా చేసుకున్నాడు జగన్. జనాలని తోలి, కనకదుర్గ బ్రిడ్జి ఊగిపోయింది అని హడావిడి చెయ్యటంలో ఉన్న శ్రద్ద, అభ్యర్ధులకి నమ్మకం కలిగించటంలో లేదు. అధికార టిడిపిలో లెక్కకు మించి అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండగా, వైకాపా తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి కొన్ని చోట్ల పోటీకి అభ్యర్థులు దొరకడం లేదు. అసెంబ్లీకి పోటీ చేయడానికి కొన్ని చోట్ల అభ్యర్థులు ముందుకు వస్తున్నా, పార్లమెంట్‌కు పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు.
రాజధానిలో కీలకమైన ఈ జిల్లాల్లో ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడం, ఆ పార్టీ స్థితిని తెలియజేస్తోంది. గుంటూరు, కృష్ణాలో మొత్తం ఐదు స్థానాలు ఉండగా, వైకాపా తరుపున పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు లేరని ఆ పార్టీనేతలే వాపోతున్నారు. ఐదు స్థానాల్లో ఒక్కస్థానం నుంచైనా, ఫలానా వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించే పరిస్థితి కనిపించడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లోనూ వైకాపా ఓటమిని చవిచూసింది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని గుంటూరు,నర్సరావుపేట, బాపట్ల నియోజకవర్గాల నుంచి 'వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వరికూటి అమృతపాణిలు పోటీ చేశారు. అదే విధంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి కొలుసు పార్థసారధి, విజయవాడ నుంచి కోనేరు రాజేంద్రప్రసాద్‌లు పోటీ చేసి ఓడిపోయారు.
పార్థసారధి మినహా, ఈ అదుగురు గత నాలుగున్నరేళ్ల నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. మిగతా వారెవరూ, మళ్లీ వైకాపా గడప తొక్కిన పాపాన పోలేదు. దీంతో, ఈ ఐదుగురు మళ్లీ పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఐదుస్థానాలకు ఐదుగురు కొత్త వారిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వైకాపాకు ఉంది. అయితే, ఇక్కడ టిడిపిని ఎదుర్కొనే దమ్మున్న నాయకులెవరూ వైకాపాలో లేరు. అదే సమయంలో పోటీ చేయడానికి వ్యాపారవేత్తలు కానీ, ఇతర నాయకులు కానీ రావడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక, మాజీ కాంగ్రెస్ నేతలు, ప్రస్తుతం బిజెపిలో ఉన్న నేతలను పోటీ చేయమని వైకాపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాయబారాలు నడుపుతున్నారు.