విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా సహా రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఆందోళన, ఆవేదన, నిరసనను శనివారం దిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో నిలదేసేందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. భారీ ప్రణాళికతో , పక్కా వ్యూహంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఆయన ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీ ముందే ఎండగట్టేలా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే రేపటి నీతి ఆయోగ్ సమావేశంపై చంద్రబాబు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తనున్నారు. 24 పేజీల సమగ్ర నివేదిక సిద్ధం సీఎం చేసుకున్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని సీఎం నిర్ణయం తీసుకన్నారు.
15వ ఆర్థిక సంఘం విధివిధానాల సవరణలకు ఆయన పట్టుబట్టనున్నారు. మాట్లాడే అవకాశమివ్వకుంటే అక్కడే నిరసన తెలిపే యోచనలో సీఎం ఉన్నట్లు వినికిడి. సీఎంతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం (17న) ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. దీనికి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఎన్డీఏతో టీడీపీ తెగతెంపుల తర్వాత వీరిద్దరూ ఎదురుపడనుండడం ఇదే ప్రథమం. అక్షర క్రమం ప్రకారం ఈ సమావేశానికి వచ్చే ముఖ్యమంత్రుల్లో మాట్లాడే తొలి అవకాశం ఆంధ్ర సీఎంకే వస్తుందని అంచనా. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తన అభిప్రాయాలను చంద్రబాబు బలంగా వినిపించనున్నారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించి... కేంద్ర ఉదాసీన వైఖరికి నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేస్తే ఎలా ఉంటుందన్నది ఒక ఆలోచన. కేంద్రం వైఖరిపై ఆగ్రహంగా ఉన్న, భావసారూప్యం కలిగిన భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్నీ కూడగట్టి నిరసన తెలియజేయాలన్నది మరో ప్రతిపాదన. ఈ అంశంపై భాజపాయేతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో చంద్రబాబు ఇప్పటికే చర్చించారు. పశ్చిమ బంగ, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామిలతో ఫోన్లో మాట్లాడారు. దిల్లీ, పుదుచ్చేరి, పంజాబ్ ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడారు. ప్రధాని ముగింపు ఉపన్యాసం చేయడానికి ముందుగా అందరూ బయటకు వచ్చేస్తే బాగుంటుందని కూడా ఒక వ్యూహంగా తెలుస్తుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ప్రధాని కార్యాలయం, దీనికి కౌంటర్ వ్యూహం కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.