రాష్ట్రానికి, కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా, తన పుట్టిన రోజు నాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అదే స్పూర్తితో, ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తన పుట్టిన రోజు నాడే నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తన పుట్టిన రోజు నాడే నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఈ మేరకు అనకాపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అవంతి మాట్లాడుతూ.. ఈ నెల 12న (రేపు) తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకుండా దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్ 20న తన పుట్టిన రోజు నాడే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు నిరాహార దీక్షలాగే, తానూ దీక్ష చేస్తున్నట్టు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు.
ప్రత్యేక హోదా, లోటు భర్తీ, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అమరావతి నిర్మాణం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజుపట్నం పోర్టు, శాసనసభ సీట్ల పెంపు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-విజయవాడల్లో మెట్రో రైలు, అమరావతికి రైలు-రహదారి అనుసంధానం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సాయం, పొరుగు రాష్ట్రం నుంచి విద్యుత్ బకాయిల వసూళ్లు, షెడ్యూల్ సంస్థల విభజన, గ్రేహౌండ్ సెంటర్ ఏర్పాటు ఇలా ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లో పేర్కొన్న 18 అంశాలపై, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రాన్ని మోసం చేసింది.