రాష్ట్రంలో అందరికీ పింఛన్లు ఇస్తున్నామని, ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తున్నామన్నారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఒక మహిళ 'అందరినీ ఆదుకుంటున్నారు.. నన్ను మాత్రమే వదిలేశారు' అని తనతో చెప్పిందన్నారు. అది నిజమేననిపించిందని, త్వరలోనే ఒంటరి మహిళకూ పింఛను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అయితే పెళ్లయి, భర్త వదిలేసిన వారికే ఇస్తామని స్పష్టం చేశారు. ఏడు రోజులపాటు జరిగిన నవనిర్మాణ దీక్షలు, మహా సంకల్ప యాత్ర, గ్రామ దర్శిని కార్యక్రమాలు కొత్త అనుభూతిని ఇచ్చాయన్నారు. నవ నిర్మాణ దీక్షలు 16,375 గ్రామాల్లో నిర్వహించారని, ప్రతీ రోజూ 30 లక్షల నుండి 35 లక్షల వరకూ ఈ సభలకు ప్రజలు తరలివచ్చారన్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామ సభల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యానని, అభివృద్థి పనులపై ఆరా తీశానని తెలిపారు. ప్రభుత్వ పథకాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. 40 ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో ఈ నాలుగేళ్ళలో చేసిన అభివృద్ధే చాలా తృప్తి నిచ్చిందన్నారు. రాష్ట్రమంతా సిమ్మెంట్ రోడ్లు వేయడం ఒక చరిత్ర అని, ఇంకా మిగిలిన వాటిని కూడా ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. 19 లక్షల ఇళ్లలో కొన్ని పూర్తి చేశామని, మిగిలినవి ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. తాను పాదయాత్ర చేసిన సందర్భంగా తాగునీటి సమస్య, మైళ్ళ దూరం నీటి కోసం వెళ్ళే పరిస్థితులను గమనించానన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని, అన్ని నీటి వసతులూ కల్పించామన్నారు. రాష్ట్రంలో 7లక్షల 25వేల పంట కుంటలు తవ్వడం వల్ల 2 మీటర్ల మేర భూగర్భ జలాల్ని పెంచగలిగామన్నారు.
దీనివల్ల రూ.500 కోట్లు విలువైన కరెంట్‌ను ఆదా చేశామని, లక్షలాది ఎకరాలకు నీరిచ్చే వీలు కలిగిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ పనులు పూర్తయ్యాయని, ఇప్పటికే డయాఫ్రం వాల్‌ని పూర్తి చేశామన్నారు. మైక్రో ఇరిగేషన్‌లో 90 శాతం సబ్సిడీ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. బిజెపి, వైసిపి నాటకాలను ప్రజల ముందు పెడతామన్నారు. ఇసుక, మట్టి గురించి విమర్శలు చేసే జగన్, బొత్సా, విజయసాయిరెడ్డిలు రూ.45వేల కోట్ల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అవినీతి పరులకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పుకు ప్రజలు శిక్షించారని, అదే పరిస్థితి వైసిపి, బిజెపిలకు ఎదురవుతుందని చెప్పారు. విభజన హామీలపై తమ పోరాటం ఆగదని సిఎం అన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, కాకినాడలో దివీస్, ఫుడ్‌పార్కు వంటి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతూ రైతులను రెచ్చగొడుతున్నారన్నారు.