ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తాగునీటి అవసరాలు తీర్చేలా...2050 వరకు ఈ నగరంలో నివసించే ప్రజల దాహార్తి తీర్చే ఉద్దేశంతో కృష్ణా నదిపై మరో బ్యారేజి నిర్మాణానికి రంగం సిద్ధమయింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామాల మధ్య కృష్ణా నదిపై ఈ బ్యారేజి నిర్మించనున్నారు. కృష్ణా డెల్టా వ్యవస్థ చీఫ్ ఇంజినీర్ రూ.2420.68 కోట్ల అంచనా వ్యయంతో జలవనరులశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పరిశీలన, ఆమోదం అనంతరం ఈ ఫైలును ఆర్థికశాఖ ఆమోదానికి పంపారు. దీనిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
కృష్ణానదిపై నూతన బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్ల పాలనా పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీకి పైన 23 కి.మీ దూరంలో వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే దీని కోసం టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించనున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు దిగువన, ప్రకాశం బ్యారేజికి ఎగువన ఈ కొత్త బ్యారేజి నిర్మాణం జరగనుంది. 2050 నాటికి రాజధాని అమరావతి ప్రాంత జనాభా 30 లక్షలకు చేరుతుందని, వారి తాగునీటి అవసరాలు తీర్చేందుకు 10 టీఎంసీల నీరు అవసరమవుతుందని లెక్కించి దీని నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. పులిచింతలకు దిగువన ప్రకాశం బ్యారేజికి ఎగువన కురిసే వర్షాలు, వాగులు వంకల నుంచి భారీ వర్షాల సమయంలో వృధాఅవుతున్న నీటిని ఈ బ్యారేజిలో ఒడిసిపట్టే అవకాశం ఉంది.
బ్యారేజి నిర్మాణ ప్రాంతంలో కృష్ణానది దాదాపు 3 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. ఇక్కడ స్పిల్ వే 1250 మీటర్లు మేర నిర్మిస్తారు. మిగిలిన 1809 మీటర్లకు మట్టితో టై బండ్ నిర్మిస్తారు. నేవిగేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. స్పిల్ వే మార్గంలో 55 గేట్లు ఏర్పాటు చేస్తారు. అది కాక స్లూయిస్ మార్గంలో మరో 14 గేట్లు ఉంటాయి. ఇది ప్రకాశం బ్యారేజి కన్నా వెడల్పు ఎక్కువగా ఉంటుంది. 2009, అంతకుముందు 1903 సంవత్సరాల్లో కృష్ణానదికి గరిష్ఠ వరద వచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి తట్టుకునేలా ఈ బ్యారేజి నిర్మాణం చేపడుతున్నారు. నది కట్టల ఎత్తును కూడా అటూ ఇటూ పెంచుతారు. భూసేకరణకే రూ.770.74 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.