ఆంధ్రప్రదేశ్... పేరు మాత్రమే పాతది! ప్రస్థానం మాత్రం పూర్తిగా కొత్త... విభజనలో అనేకం కోల్పోయి, ఎన్నెన్నో సమకూర్చుకోవాల్సినంత సంక్లిష్టత! రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఇలా మిగిలింది! ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం మొదలుపెట్టి సరిగ్గా నాలుగేళ్ళు గడిచింది. సరిగ్గా ఇదే రోజు 08-06-2014న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు చంద్రబాబు. నేటికీ నాలుగేళ్ళు పూర్తిచేసుకొని అయిదవ ఏట అడుగెడుతున్నారు.
విభజన సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కుట్రలు కుతంత్రాలకు, బలైన ఆంధ్రప్రదేశ్ ను నాలుగేళ్ళులోనే శిఖరాగ్రానికి చేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుత విజయం సాధించారు. బాధ్యత లేని స్వార్ధ పాలకులు కుప్పకూల్చిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడానికి ఒక సైన్యంలా యుద్ధం చేస్తున్న సాధకుడు చంద్రబాబునాయుడు. సవాళ్ళ మద్య సారధ్యం చేపట్టి సమస్యలకు తలొగ్గేది లేదన్న తెగువను కనబరిచారు. భారమైనా నవ్యాంధ్ర ఐదుకోట్ల ప్రజల భవితను తన భుజాలకు ఎత్తుకొని మోస్తున్నారు చంద్రబాబునాయుడు. పట్టిన పట్టువదలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం పై నమ్మకం! రాష్ట్రానికి ఉన్న వనరులు.. ఈ రెండు ఉన్నాయి అనే ధైర్యంతో, భవిష్యత్తు పై నమ్మకంతో నవ్యాంధ్ర ప్రజలు ముందుకు సాగుతున్నారు ! మరి నాలుగేళ్ళులో ఈ ప్రయాణం ఎందాకా సాగింది? నవ్యాంధ్ర భవిష్యత్తు ఎలా ఉంది? చంద్రబాబు పాలన ఏ దిశగా సాగుతోంది?
విభాజన జరిగిన నాడు, నవ్యాంధ్రకు ఉన్న సానుకూలాంశం ఒక్కటే, సమర్ధ నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటమే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి వనరులు లేవు. ఆ పరిస్థితుల నుండి దిక్కు మొక్కు లేని అనాథగా మారిన ఆంధ్రప్రదేశ్ కు దశా, దిశ కల్పించి, నాలుగేళ్ళులో రాష్ట్రాన్ని, నిలబెట్టారు చంద్రబాబు. అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అబ్బుర పరుస్తున్నాయి.
24 గంటలు విరామంలేని విద్యుత్ సరఫరా, రాజధాని ప్రాంతం ఎంపిక, రాజధాని భూసేకరణ, రాజధాని శంకుస్థాపన, పట్టిసీమ నిర్మాణం,యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు, ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, ఫైబర్ గ్రిడ్, భారీ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక క్లస్టర్లు, ఆహార శుద్ధి పార్కులు, పర్యాటకం, మీ ఇంటికి-మీ భూమి, వ్యవసాయ రంగం బలోపేతం, రైతు సంక్షేమం, ఆకర్షణీయమైన గ్రామాలు, జన్మభూమి, పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ విద్య సంస్థలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నీరు-ప్రగతి, పంటకుంటలు, 7 మిషన్లు, 5 గ్రిడ్ లు, దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయనటువంటి సంక్షేమ పథకాలకు ఆకాశమే హద్దు అనే విధంగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి రాష్ట్రాన్ని రాచబాట ఎక్కించారు ముఖ్యమంత్రి చంద్ర బాబు.
అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యటం: అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు లేడు. సవాళ్లు ఎదురైనా సమస్య ఎంత తీవ్రమైనది అయినా పరిష్కారం ఎంత కష్టసాధ్యమైనది అయినా చంద్రబాబు వెనుతిరిగిన దాఖలాలు లేవు. ఏ పని అయినా పట్టుకుంటే అది అనుకున్న సమయానికి పూర్తి కావాల్సిందే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీని 13 నెలల్లో నిర్మించిన ఘనత, ఏడాదిలో కృష్ణా నీటిని హైదరాబాదుకు తరలించిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు గోదావరి నదిపై పట్టిసీమ పథకాన్ని పట్టుబట్టి ఐదున్నర నెలల్లో పూర్తి చేశారు. కృష్ణమ్మ, గోదావరిలను జత కలిపిన సాధకుడు చంద్రబాబు.
మన గడ్డ నుంచే పాలన: ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాదులో కొనసాగే అవకాశం ఉన్నప్పటికి సాధ్యమైనంత త్వరగా పరిపాలన సొంతగడ్డకు తరలించాలన్న పట్టుదలతో వ్యవహరించి అకుంఠిత దీక్షతో ముందడుగు వేశారు. అమరావతి నడిబొడ్డున వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేశారు. అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టిన 192 రోజుల్లో ఆధునిక హంగులతో నిర్మాణమైంది.
అమరావతి: భవిష్యత్ అవసరాలను అందుకునే భారీ ప్రణాళికలతో అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. అమరావతి రేసు గుర్రంలా పరుగెడబోతుంది. అధునాతన ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణానికి పూనుకోవడం సాదాసీదా వ్యవహారం కాదు. ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించగానే 34వేల ఎకరాలు సారవంతమైన భూముల్ని ప్రభుత్వానికి రాసిచ్చి సరికొత్త చరిత్రను సృష్టించి దేశానికి ఆదర్శంగా నిలిచారు రైతులు. గత మూడేళ్ళలో ప్రపంచ స్థాయి రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి తగిన వనరుల్ని సమీకరించుకున్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణుల్తో ఈ నగర నిర్మాణానికి ఆకృతుల రూపకల్పన చేయిస్తున్నారు. 2019నాటికి అమరావతి నగరానికో రూపురేఖలు తేవడం ఇప్పుడు చంద్రబాబు ప్రధాన లక్ష్యం.
పోలవరం: 2014 ఎన్నికల్లో విజయం సాధించాక, ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే సాగునీటి పథకాలపై దృష్టి సారించారు. దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయిన పోలవరం ప్రాజెక్టు ఫైలు దుమ్ము దులిపారు. ఈ ప్రాజెక్టును 2018 నాటికే పూర్తి చేయాలని సంకల్పించారు. కాని కేంద్రం సహకారం లేకపోవటంతో, ఈ లక్ష్యం 2019కి చేరింది. ప్రతి సోమవారం పోలవరం పనులపై ‘వర్చువల్ రివ్యూ’ చేస్తున్నారు. ఇప్పటిదాకా 56 సమీక్షలు చేశారు. ‘సోమవారం నాకు పోలవారం’ అని ప్రకటించేశారు.
ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు: పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలే కాకుండా సీమకు సాగునీటిని అందించే పథకాల వేగాన్ని పెంచింది. హంద్రీ-నీవా మెదటి, రెండో దశలు, గాలేరు నగరి సుజల స్రవంతి తొలి దశ, వెలిగొండ, గుండ్లకమ్మ, వంశధార, తోటపల్లి ప్రాజెక్టులనూ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. ‘భూగర్భమే పెద్ద జలాశ యం. వర్షపు నీటిని అందు లో భద్రపరచాలి’ అని తరచూ చెప్పే ముఖ్యమంత్రి.. పంట కుంటలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధి హామీ పథకం నిధులను ఇందుకు సమర్థంగా ఉపయోగిస్తున్నారు
రైతు రుణమాఫీ: రూ.50వేల లోపు రుణాలు ఏకమొత్తంలో మాఫీ జరిగాయి. ఇప్పటికే మూడు విడతల్లో రైతు ఖాతాల్లో జమ చేయడమైంది. హామీ ఇవ్వకపోయినప్పటికీ ఉద్యాన రైతులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.370 కోట్ల రుణాలు మాఫీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన తొలి రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ దేశంలో గుర్తింపు పొందింది.
డ్వాక్రా రుణమాఫీ: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక శక్తిని పెంపొందించాలని ఒక్కొక్కరికి రూ.10 వేలు ధన సహాయం ప్రకటించడమైంది. 86,79,129 మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరింది.
విద్యుత్: గృహ విద్యుత్తు సరఫరాకు 4 నుంచి 10 గంటలపాటు అధికారిక కోతలు.. పరిశ్రమలకు వారంలో మూడు రోజులు పవర్ హాలిడేస్.. రాత్రి 10 దాటాక విద్యుత్తు వాడే పరిశ్రమలపై ఫైన్... వ్యవసాయ అవసరాలకు అర్థరాత్రి వేళ ఎప్పుడు విద్యుత్తు సరఫరా అవుతుందో తెలియని దుస్థితి... ఇదీ రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు సరఫరా పరిస్థితి.
అలాంటి దుస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసే స్థాయికి తీసుకురావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే నవ్యాంధ్ర ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించిన కీలక రంగాల్లో విద్యుత్తు రంగం ఒకటి. తనకున్న అనుభవం, సామర్థ్యంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే రోజుకి 22 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటులో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తు దిశగా నడిపించగలిగారు. మూడేళ్లలో విద్యుత్తు రంగంలో భారీ మార్పులు జరిగాయి. పరిశ్రమలు, గృహాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్ అందుతోంది. రైతులకు వేలాది సోలార్ పంప్సెట్లు సరఫరా చేస్తున్నారు. విద్యుత్‌రంగ సమర్థ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 19 అవార్డులు వచ్చాయి.
పెన్షన్లు: మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లు ఐదు రెట్లు పెరిగాయి. వితంతువులు, వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్ అందిస్తున్నారు. ప్రతినెలా 47 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, కళాకారులకు పెన్లన్లు అందుతున్నాయి. ఇందుకోసం ఏటా రూ.5,500 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు.
పెట్టుబడులు: హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు కంటే దీటుగా నవ్యాంధ్రను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి చెందాలంటే పెట్టుబడులే ప్రధానమని గుర్తించి చంద్రబాబు ఇప్పటి వరకు మలేషియా, సింగపూర్, జపాన్, చైనా, దావోస్, రష్యా, అమెరికా వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ ఐటీ కంపెనీల సీఈవోలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. 13 వేల కోట్ల పెట్టుబడులతో "కియా" రాకతో రాష్ట్రానికి ఆటోమొబైల్ రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. ఇప్పటికే రాష్ట్రానికి ఇసుజు, హీరో మోటార్స్, ఆశోక్ లెలాండ్, అపోలో టై ర్స్, సియట్ టైర్స్, భారత్ ఫోర్డు, టివిఎస్ గ్రూపు, వీరా బస్బిల్డింగ్ యూనిట్ వంటి సంస్థలు వచ్చాయి.
ప్రజలే ముందు: "ప్రజలే ముందు" ఇదే ఇప్పుడు ప్రభుత్వ నినాదం... పీపుల్ ఫస్ట్ (ప్రజలే ముందు) పేరిట ఒక కాల్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. ప్రజలు 1100 నెంబరుకు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను, ఫిర్యాదులను, సలహాలను, అభిప్రాయాలను నిర్భయంగా తెలియచేయడమే గాక, పరిష్కారం కూడా పొందవచ్చు.
టెక్నాలజీ: టెక్నాలజీ వినియోగం ద్వారా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచి అవినీతికి అడ్డుకట్ట వేయడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.24 వేల కోట్ల రైతు రుణమాఫీ, ప్రతి ఏటా రూ.5,700 కోట్ల విలువైన పింఛన్ల పంపిణీ, రూ.3 వేల కోట్ల రేషన్ పంపిణీలో పైసా అవినీతి లేకుండా అమలుచేయడం ప్రభుత్వం సాధించిన విజయం.
ఆదాయం: విభజన నాటికి తలసరి ఆదాయం రూ.95,689తో దేశంలో 9వ స్థానంలో రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండంకెల అభివృద్ధి రేటును అందుకున్నది. జాతీయ సగటు వృద్ధిరేటు కంటే రాష్ట్రం అధిక వృద్ధిరేటు సాధించగలిగింది. ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకోగల సమర్థ నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైందని విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. మూడేళ్లలో ఇంత ప్రగతిని సాధించడం ఆషామాషీ విషయం కాదు.
బిసి సంక్షేమం: బిసి సబ్‌ప్లాన్ కింద రూ.10,000 కోట్లు బడ్జెట్ కేటాయింపు జరిగింది. అత్యంత వెనుకబడిన 32 కులాలకు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు ఆర్థిక సాయం, బీసీ భవన్ల నిర్మాణాలకు నిధులను కేటాయించడం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయి.
ఎస్సీ , ఎస్టీ సంక్షేమం: ఎస్సీ సబ్‌ప్లాన్‌కు మూడేళ్లలోనే 19,532.22 కోట్లు ఖర్చు చేయడం జరిగింది (నాలుగో ఏడు వివరాలు అందలేదు). ఈ ఏడాదికి రూ. 9,837 కోట్లు కేటాయించడం జరిగింది. అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణంలో భాగంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి భూమిపూజ జరిగింది.
గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా ఎస్టీల సంక్షేమం కోసం 2017-18లో రూ.1815.32 కోట్లు కేటాయించారు. ఎస్టీ బాలికలకు వివాహ సమయంలో రూ.50వేలు ఆర్థికసాయం అందించడం జరుగుతోంది. జగ్జీవన్ జ్యోతి పేరుతో నెలకు 75 యూనిట్ల లోపు వినియోగించిన వారికి ఉచిత విద్యుత్ అందుతోంది. మైనార్టీల సంక్షేమం కోసం మూడేళ్లలో రూ.1962 కోట్లు ఖర్చు జరిగింది. కడపలో హజ్‌హౌస్‌ను నిర్మించడం జరుగుతోంది.
మైనారిటీస్ కార్పొరేషన్: మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా పేదలకు రుణాలు, ఇమాం, మౌజమ్‌లకు గౌరవ వేతనం అందుతున్నాయి. దుల్హన్ స్కీమ్ ద్వారా వివాహ సమయంలో మైనారిటీ బాలికలకు రూ.50వేల ఆర్థికసాయం అందిస్తున్నారు.
క్రిస్టియన్ కార్పొరేషన్: క్రిస్టియన్ కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ.75 కోట్లు కేటాయించారు. గుంటూరులో క్రిస్టియన్ భవన్ నిర్మాణం, జెరూసలేం యాత్ర పథకం ద్వారా రూ.40వేల ఆర్థిక సాయం అందుతోంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాపుల అభివృద్ధి కోసం ఏడాదికి రూ.1000 కోట్లు కేటాయించడం జరిగింది. 65 వేల మందికి కాపు కార్పోరేషన్ ద్వారా రుణాలు అందాయి, 1000 మందికి పైగా విద్యార్థులకు విదేశీ విద్య లభిస్తోంది.
బ్రాహ్మణ సంక్షేమం: బ్రాహ్మణ సంక్షేమానికి 2017–-18 బడ్జెట్లో రూ. 97 కోట్లు కేటాయించి బ్రాహ్మణ సంక్షేమం పట్ల చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పర్యవేక్షణలోని ఆలయాల్లో పనిచేసే వారి కోసం ‘అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి’ బాసటగా నిలుస్తోంది. అర్చకులకు వంశపారంపర్య హక్కు కలగ జేసింది. 50 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో పనిచేస్తూ నెలకు రూ.12,500 కంటే తక్కువ వేతనం ఉన్న వారి కోసం అర్చక, ఉద్యోగుల సంక్షేమనిధి ఏర్పాటైంది.
అగ్రవర్ణ పేదలకు సాయం: కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామనే ఉద్దేశంతో అగ్రవర్ణ పేదలకు సాయం. 2017-18 నుండే ఈబీసీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని నిర్ణయం. రూ.700 కోట్లతో ఈబీసీ కార్పొరేషన్. బ్యాంకుల ద్వారా విద్యా , వ్యాపారాభివృద్ధికి రుణాలు , అగ్రవర్ణ పేద విద్యార్ధులకు ఫీజు రీఎంబెర్సుమెంట్, చిన్న , మధ్య తరహా వ్యాపారస్తులకు రుణాలు ఇప్పించే కార్యక్రమాలు
బాలికలకు ఉచిత సైకిళ్ళు: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని పాఠశాల విద్యను అభ్యసించే లక్షా 82వేల 556 మంది బాలికలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది.
అన్న సంజీవని: ‘అన్న సంజీవని’ పథకం కింద జెనరిక్ మందుల దుకాణాల బాధ్యతను మహిళలకు అప్పగించారు. సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు, కిశోర్ బాలికా సంరక్షణ పథకం, గృహిణి, రోషిణి, దీపం, ముస్లిం మహిళల కోసం డ్వామ్వా పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది.
ఆరోగ్యం: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ, ఎన్టీఆర్ వైద్యసేవ కింద పరిమితిని 2.5 లక్షలకు పెంచి, అదనంగా 100 వ్యాధులు చేర్చి 1,038 వ్యాధులకు వైద్యం అందించడం జరుగుతోంది.
చంద్రన్న భీమా: అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం ద్వారా కేవలం రూ.15 చెల్లించి, వ్యవసాయ కార్మికులు, స్వయం సహాయక బృందాల మహిళలు, ఉపాధి హామీ కార్మికులు, లారీ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని పొందుతున్నారు.
రేషన్: 1.25 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డు దారులకు రేషన్ బియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలకు పెంచడమైంది. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక అందించడం జరుగుతుంది.
మరెన్నో పధకాలు: ఆరోగ్య రక్ష, స్వాస్ద్హ్య విద్యావాహిని, పుర సేవ, బడికొస్తా, ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పధకం, దివ్యదర్శనం, చంద్రన్న ఉన్నత విద్యాదీపం, చంద్రన్న సంచార చికిత్స, జన్మభూమి - మా ఊరు, నీరు-ప్రగతి, షీ ఆటో, ఎన్టీఆర్ జలసిరి, ఈ-ప్రగతి, మీ ఇంటికి - మీ భూమి లాంటి మరెన్నో పధకాలు ఉన్నాయి.
ఆంధ్రుల నమ్మకాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ముందడుగు వేశారు అనటంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రజలకు కనీస సౌకర్యాలు అందించడం కూడా కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం సాధించిన విజయం ఆషామాషీ కాదు. శిథిలమైన నవ్యాంధ్రను శిఖరాగ్రానికి చేర్చడానికి ఆయన తన శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు. దుర్మార్గుల ఉచ్చులో పడకుండా, ఆ నాయకుడి సార్దంలో, స్వర్ణాంధ్ర సాధించుకుందాం... మన కలల రాజధాని అయిన అమరావతిని, మన జీవనాడి అయిన పోలవరాన్ని నిర్మించుకుని, బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుందాం.