గత వారం రోజులుగా, అంటే అమిత్ షా తిరుమల వచ్చి, రమణ దీక్షితులను కలిసి వెళ్ళిన వెంటనే, ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసే కుట్రతో, సాక్షాత్తు శ్రీవారినే వాడుకుని, రాజకీయాలు చేస్తున్నారు ఆపరేషన్ గరుడ బ్యాచ్.. ఈ ఛండాలపు రాజకీయాలకు, తిరుమల ప్రతిష్టతను మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు.. తిరుమల పై జరుగుతున్న విష ప్రచారం పై ఈ రోజు టీటీడీ ఈవో సింఘాల్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు, పూజలు.. శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని వివరించారు. శ్రీవారి నగలన్నీ భద్రంగా ఉన్నాయని ఆయన అన్నారు. 2012లోనే అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి అమలులోకి వచ్చిని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఆ సమయంలోనే ముగ్గురు అర్చకులు రిటైర్ అయ్యారని సింఘాల్ తెలిపారు. రిటైర్ అయిన అర్చకులు కోర్టుకెళ్లారని, వారి విజ్ఞాపనను కోర్టు తిరస్కరించి౦దని, జీతభత్యాలు లేకుండా అర్చకులుగా కొనసాగవచ్చని కోర్టు ఆదేశించిందన్నారు. వంశపారంపర్య అర్చకుల వారసులు తమకు అవకాశం ఇవ్వాలని టీటీడీని కోరారని, అలాగే ప్రధాన అర్చకులుగా తమకు అవకాశం కల్పించాలని గొల్లపల్లి కుటుంబానికి చెందిన వేణుగోపాల దీక్షితులు కోర్టుకెళ్లారని ఈవో తెలిపారు. సర్వీస్ ప్రకారం టీటీడీలో సేవలందించిన సీనియర్‌కు ప్రధాన అర్చకులుగా నియమించడం జరిగిందని సింఘాల్ తెలిపారు. ప్రధానంగా రమణ దీక్షితులు చేసిన విమర్శలపై ఈవో సింఘాల్ మీడియా ద్వారా భక్తులకు వివరణ ఇచ్చారు. భక్తులకు వాస్తవాలు తెలియజేసేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు.
‘ శ్రీవారికి పూజా కైంకర్యాలన్నీ శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. స్వామివారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయి. ఇటీవల తితిదే బోర్డు నిర్ణయాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆలయాల మరమ్మతుల విషయంలో భక్తులకు అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసేందుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రభుత్వ జీవోను మాత్రమే అమలు చేస్తున్నాం. శ్రీవారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కా లెక్కలున్నాయి. స్వామివారికి వచ్చిన నగలన్నింటినీ ఏటా ప్రజల ముందు ఉంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.