నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు కోసం ప్రత్యామ్నాయాల పరిశీలిస్తున్నారు చంద్రబాబు... పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్లాకు నీళ్లిచ్చి ఆయకట్టును కాపాడుతున్న తరహాలోనే నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకూ నీళ్లిచ్చేలా మరో ఎత్తిపోతల చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందుకు గోదావరి నీటి మళ్లింపు ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 17 మీటర్ల స్థాయిలో ఉన్న నీటిని పైపుల ద్వారా కొంత, కాలువల ద్వారా మరికొంత మూడు చోట్ల ఎత్తి పోస్తూ 165 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అక్కడి నుంచి సాగర్ కుడి కాలువలో పోసి ఆ ఆయకట్టుకు నీరందించాలని భావిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజికి ఎగువన, వైకుంఠపురం బ్యారేజి ప్రతిపాదిత స్థలానికి మధ్యలో ప్రకాశం బ్యారేజి బ్యాక్ వాటర్ వద్ద అనువైన స్థలంలో ఎత్తిపోతల నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రాధమికంగా వైకుంఠపురం బ్యారేజి నిర్మాణం వేగంగా పూర్తి చేసి నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తుండగా అది ఆలస్యం కావచ్చు కాబట్టి ఈ ఎత్తిపోతల ప్రత్యామ్నాయాన్ని కూడా జలవనరుల శాఖ ఆధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 8000 క్యూసెక్కుల చొప్పున వరద కాలంలో 80 టీఎంసీల మళ్లింపు లక్ష్యం కాగా ఈ ఏడాది దాదాపు 105 టీఎంసీలు మళ్లించారు.
పోలవరం కుడి కాలువ సామర్ధ్యం మేరకు దాదాపు 14000 క్యూసెక్కులు మళ్లించే అవకాశం ఉంది. అయితే నీటిని ఎత్తిపోసేందుకు పట్టిసీమ చాలదు... చింతలపూడి పధకంలో భాగంగా గోదావరి వద్ద ఎత్తి పోతల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ నీళ్లు నేరుగా చింతలపూడి ఆయకట్టుకు తరలించేందుకు, జలాశయానికి మళ్లించేందుకు వీలుగా పనులు పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఈ లోప చింతలపూడి ఎత్తిపోతల నుంచి కొంత, తాడిపూడి ఎత్తిపోతల్లో అదనంగా ఉన్న పంపులతో కొంత ఎత్తిపోసి కుడి కాలువకు మళ్లించి వరద కాలంలో దాదాపు 150 టీఎంసీలకు పైగా ప్రకాశం బ్యారేజికి తరలించాలని యోచిస్తున్నారు... ఇది వచ్చే సీజన్ నాటికి రెడీ చెయ్యాలని చూస్తున్నారు.. నిన్న జరిగిన క్యాబినెట్ కూడా ఈ ప్రపోజల్ ఆమోదించింది...