హైకోర్టు విభజన జరాగాల్సిందే!! కానీ, దానికన్నా ముందు ఉమ్మడి ఆస్తులను పంచి తీరాలి. పదేళ్లు వరకు ఉమ్మడి రాజధాని అన్న తర్వాత పదేళ్లు వేచి చూడాలి. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అని ఇప్పటి నుండే మరోసారి తెలంగాణ ప్రజల్లో, ఆంధ్రుల పట్ల విషబీజాలు నాటి, పెద్ద చేసి వాటి నీడలో సేద తీరాలని చూస్తున్న తెరాస ఆడుతున్న నాటకం. అవును !! మా హైకోర్ట్ మాకు కావాలి, దానితోపాటు ఉమ్మడి ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వాలి. ( ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లో చెప్పినట్లు గానే ). హైకోర్టు విభజన గురించి మాట్లాడే ముందు, ఆస్తుల గురించి మాట్లాడి తీరాల్సిందే. మరో ఆరేళ్ళ పాటు ఆంధ్రులకు ఉమ్మడి ఆస్తుల మీద హక్కు ఉంది. సాధికారికమైన హక్కు ఉంది. హైదరాబాద్ లో ఉండాలా వద్దా అన్నది మా ఛాయస్.... కాని, ఆస్తులు పంపకం అనేది మా హక్కు... ఆస్తుల విభజన పూర్తయ్యాకే, హైకోర్టు విభజన జరగాలి. లేదంటే ఆస్తి గొడవలన్నీ తెలంగాణా కోర్ట్ పరిధిలోకే వస్తాయి. అప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. ఈ ఉమ్మడి ఆస్తులు విభజించకుండా, హైకోర్ట్ ఎలా విభజిస్తారు ?
రాజధాని హైదరాబాద్ ప్రభుత్వ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ లో 58% ఆంధ్ర ప్రదేశ్ కె చెందాలి. వీటిలోనే 9,10 షెడ్యూల్ సంస్థలు వున్నాయి, సుప్రీం కోర్ట్ కూడా ఇదే చెప్పింది. హైదరాబాద్ లోని ఆర్.టి.సి ఉమ్మడి ఆస్తులలో 58% వాటా ఇవ్వాల్సిందే. షీలా బిడే కమిటీ కూడా ఇదే చెప్పింది. హైదరాబాద్ లో ఉన్న 450 కేంద్ర ప్రభుత్వ సంస్థ లు, విద్యా సంస్థలు లో 58% ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలి. ఇది కేంద్రం చేపట్టాల్సిన చర్య. 10 వ షెడ్యూల్ సంస్థలలో సుప్రీం తీర్పే దీనికి కూడా స్ఫూర్తి. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు వుమ్మడి రాజధాని శాంతిభద్రతలు, పౌరుల రక్షణ, ఆస్తుల సంరక్షణ లాంటి అంశాలు గవర్నర్ చేతిలోనే సంపూర్ణంగా వుండాలి, కానీ ఇప్పటిదాకా ఇది కార్య రూపం దాల్చలేదు.
తెలంగాణా టీఆరెస్ ఏంపీలు, తెలంగాణా బీజేపీ నేతలూ 9,10 షెడ్యూల్ ఆస్తుల విభజన, వీటి గురించి కూడా మాటాడండి. హైకోర్టు ఓక్కటే ఉమ్మడిగా ఉందా ? ఇంకా చాలా ఉన్నాయ్. ఆంధ్రప్రదేశ్ యంపీలు అందరూ పార్టీలకతీతంగా ఒకటై ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఆస్తులపై త్వరగా తేల్చమని నిలదీయాలి. ఇప్పటికే ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో వేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ఒత్తిడి తేవాలి... పవన్ కళ్యాణ్ లాంటి వారు, జగన్ లాంటి వారు ఈ ఉమ్మడి ఆస్తులు పై ఇప్పటి వరకు మాట్లాడలేదు.... ప్రత్యెక హోదా సంగతి తరువాత, ముందు మన ఆస్తుల పంపకం గురించి కూడా ప్రతిపక్షం ఒత్తిడి చెయ్యాలి. వివాదాలు వచ్చినప్పుడు కల్పించుకోవాల్సిన కేంద్రం మౌనంగా కూర్చోకూడదు. పనిచేసి తీరాలి. జుట్టుపట్టుకోని పనిచేయించుకోవాలి. ముందు ఆస్తి పంపకాలు చేయాలి, ఆ తర్వాత హైకోర్టు సంగతి చూసుకోవచ్చు.