హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్టహాసంగా జరుగుతున్న తెలుగు సభలకు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖులను ఆహ్వానించినా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందలేదు. దీనిపై పలువురు మండిపడ్డారు కూడా... ఎన్ని విమర్శలు వచ్చినా కెసిఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలవటానికి ఇష్టపడలేదు... అయితే ఈ విషయంపై చంద్రబాబునాయుడు స్పందించారు.
తెలుగువారంతా కలిసి ఉండాలని... తెలుగు భాష బాగుండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో మూడు రోజులుగా దళిత నేతలకు జరుగుతున్న శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన శుక్రవారం రాత్రి హాజరయ్యారు. అక్కడే మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సభలకు మిమ్మల్ని పిలవలేదు కదా! మీ కామెంట్ ఏమిటి?’’ అని ఓ విలేఖరి ప్రశ్నించగా...
‘‘నన్ను పిలవకపోయినా ఫర్వాలేదు. తెలుగువారం ఎక్కడ ఉన్నా మన భాషను గౌరవించుకోవాలి. భాషను కాపాడుకోవాలి. తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతుంది. తెలుగువారంతా కలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష. ఎవరు ఎక్కడ ఉన్నా మనమంతా తెలుగు వారమన్న స్ఫూర్తి పోకూడదు’ అని చంద్రబాబు బదులిచ్చారు. కెసిఆర్ ఎంతగా అవమానించాలి అని చూసినా, చంద్రబాబు మాత్రం చాలా హుందాగా, వివాదాలకు తావు లేకుండా, ఒక స్టేట్స్ మెన్ లా స్పందించి, అందరి మన్ననలు అందుకున్నారు...