దేశంలోనే తొలి గూగుల్ కోడ్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కానుంది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని వద్దనున్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో గూగుల్ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనాల కసరత్తు తుది దశకు చేరుకుంది. త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభకానున్నాయి. ఇప్పటికే గూగుల్ తో కలిసి నైపుణ్యాభివృద్ధి సంస నిర్వహిస్తున్న శిక్షణల అమలు బాగుండటంతో ఈ కోడ్ ల్యాబ్ మన రాష్ట్రంలో ఏర్పాటుకు గూగుల్ ముందుకు వచ్చింది. ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులకు గూగుల్ సంస్థతో కలిసి నైపుణ్యాభివృద్ధి సంస్థ గూగుల్ ఆండ్రాయిడ్ శిక్షణ నిర్వహిస్తోంది.
యంగ్ టెక్నో క్రాట్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇటీవల 5 నుండి 10వ తరగతి వరకూ విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. ఇలా నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న శిక్షణల పరిశీలన అనంతరం ఈ కోడ్ ల్యాబ్ గూగుల్ సంస్థ ముందు కొచ్చింది. ఇంజనీరింగ్ లో ఆండ్రాయిడ్ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేవారికి యాప్ల తయారీ పై కోడ్ కాన్టెస్టులను నిర్వహిస్తారు. విద్యార్థులు అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ల పనితీరును పరిశీలిస్తారు. అవసరమైన విద్యార్ధులకు ఇక్కడ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 82 ఇంజనీరింగ్ కళాశాల్లో 17,425 మంది విద్యార్ధులు గూగుల్ ఆండ్రాయిడ్ శిక్షణ పూర్తి చేయగా, ప్రస్తుతం మరో 2,498 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఇంజనీరింగ్ మూడో ఏడాదిలోనే ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది 10 వేల మందికి విద్యార్థులకు గూగుల్ సర్టిఫికేషన్ ఇప్పించాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తోంది.
ఈ ధృవీకరణ పత్రం లభించిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ఒక్కో విద్యార్ధికి సుమారు రూ.6,500 వరకూ వ్యయం కానుంది. దీంట్లో 50 శాతం నైపుణ్యాభి వృద్ధి సంస్థ ద్వారా చెల్లించనున్నారు. పాఠశాల స్థాయిలో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు ఐదు నుండి పదో తరగతి వరకూ నాలుగు విడతలుగా గతంలో శిక్షణ ఇచ్చారు. గూగుల్ ఇండియా కోడ్ టు లెర్న్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జూలై 26 నుండి సెప్టెంబరు 5 వరకూ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించింది. ప్రైవేటు, ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 1,24,768 మందికి శిక్షణ ఇచ్చారు. దేశంలో మూడేళ్ళలో రెండు మిలియన్ల మొబైల్ డెవలపర్స్ ను తయారు చేయనున్నట్లు గూగుల్ సంస్థ గతేడాది ప్రకటించింది. ఇందులో 25 శాతం ఏపీ నుండే ఉండాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ పని చేస్తోంది.