ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నమైన విజనరీ ఆలోచనతో ముందుకొచ్చి, అధికారులని ఆ దిశగా ప్రణాళికలు రచించమన్నారు... దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య పట్టిక (హెల్త్ ప్రొఫైల్స్ ను) తయారు చేయలని చంద్రబాబు ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఆరోగ్య శాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి ఆరోగ్యం పట్ల ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలనేది తన అభిమతమని అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉండేలా సరి కొత్త కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా తాయారు చేసిన హెల్త్ ప్రొఫైల్స్ నుంచి ప్రజల ఆరోగ్యం పై ప్రతి మూడు నెలలకొకసారి విశ్లేషించుకుంటూ తగిన జాగ్రత్తలు, డాక్టర్స్, రీసెర్చ్ చేసే వారి సలహాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపదవచ్చని చెప్పారు. అంతే కాకుండా, ఈ హెల్త్ ప్రొఫైల్స్ వల్ల వారసత్వ రోగాలను త్వరగా గుర్తించడానికి, వారి ఆరోగ్యంపై పూర్తి అవగాహన ఏర్పడటానికి వీలవుతుందని, అందువల్ల ఈ హెల్త్ ప్రొఫైల్స్ తయారీలో అన్ని శాఖలు ఏక తాటిపై నడిచి తన ఆలోచనను సాకారం చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
ఈ విధంగా సిద్దం చేసిన హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటలైజ్ చేసి భద్రపరచాలని సూచించారు. ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్య పట్టిక తయారు చేయడం లాంటి ప్రయోగం భారతదేశంలో ఎక్కడ జరగలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. తాను అనుకున్న విధంగా ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్స్ తయారైతే ప్రతి పౌరుడి ఆరోగ్యం, అనారోగ్య వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయని అన్నారు. దీనివల్ల వారికి వైద్యం చేయించడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సులభమవుంది. ఇది ఆరోగ్య చరిత్రలో నూతనాధ్యాయం కావాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. వైద్య సేవలపై ప్రజల్లో సంతృప్తి శాతం పెంచాలనేదే తన అభిమతమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే కనుక ఆచరణలోకి వస్తే, నిజంగానే అది ఒక అద్భుతం అవుతుంది. ముఖ్యమంత్రి ఆకాంక్షకు తగ్గట్టు, అధికారాలు కూడా పని చేసి, ఇది వాస్తవ రూపం దాల్చుతారు అని ఆశిద్దాం...