ఇటీవ‌ల వ‌ర‌కూ ముఖ్య‌మంత్రి ఏ స‌భ‌లో పాల్గొన్నా, ఏ స‌మీక్ష‌కి హాజ‌రైనా ఒక‌టే మంత్రం జ‌పించేవారు. అదే వైనాట్ 175. అది త‌న పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కి ఉత్సాహం ఇచ్చే స్లోగ‌న్ అని సీఎంకి తెలుసు. వాస్త‌వంలోకి వ‌స్తే, పార్టీలో కోర్ టీములో వాళ్లుంటారో, ఉండ‌రో తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వెన్నుద‌న్నుగా నిలిచే ఆయ‌న సామాజిక‌వ‌ర్గం ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు దూరం అవుతూ వ‌స్తున్నారు. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి, ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. పార్టీలో నెంబ‌ర్‌2గా చెలామ‌ణి అయ్యే విజ‌య‌సాయిరెడ్డి చాలా రోజులుగా పార్టీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటున్నారు. జ‌గ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర బంధువు బాలినేని శ్రీనివాస‌రెడ్డి ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉండ‌లేనంటూ రాజీనామా చేశారు. వీరంతా దాదాపు వైకాపాకి దూరం అయిన‌ట్టే. వైకాపా నుంచి గెలిచిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు చాలా రోజులుగా వైకాపా చెవిలో జోరీగ‌లా త‌యార‌య్యారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ పేరుతో దూరం పెట్ట‌గా..మ‌రో 18 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టిడిపికి ట‌చ్‌లోకి వెళ్లార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల్లో 175 సీట్లు గెల‌వ‌డం అటుంచి ఇప్పుడున్న 151 మందిలో ఎంత‌మంది ఎన్నిక‌ల వ‌ర‌కూ జ‌గ‌న్ రెడ్డితో ఉంటార‌నేది ఇప్పుడు వైకాపాలో హాట్ టాపిక్‌గా న‌డుస్తోంది.

గ‌త కొద్దిరోజులుగా బాలినేని, వైకాపా అధిష్టానంపై కోపంగా ఉన్నారు. త‌న బావ అయిన సుబ్బారెడ్డి త‌న‌కి జిల్లాలోనూ, పార్టీలోనూ చెక్ పెడుతున్నార‌నే కోపంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైకాపా అధిష్టానాన్ని బెదిరించేందుకు రాజీనామా అస్త్రం ప్ర‌యోగించారు. అయినా వైకాపా పెద్ద‌లు లొంగ‌లేదు. సరిక‌దా బాలినేని శ్రీనివాస‌రెడ్డిని పార్టీ నుంచి వెళ్ల‌గొట్టే ప్ర‌య‌త్నాలు ఆరంభించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి బాగా ద‌గ్గ‌రైన తెలంగాణ‌కి చెందిన గోనె ప్ర‌కాశ్ రావుతో బాలినేనిపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఆయ‌న సుబ్బారెడ్డిని వెన‌కేసుకొస్తూ బాలినేని అవినీతిప‌రుడంటూ రోజూ మీడియాకి ఎక్కుతున్నారు. త‌మ పార్టీ కాదు, త‌న‌కేం సంబంధంలేని గోనె ప్ర‌కాశ్ రావు త‌న‌ని టార్గెట్ చేయ‌డం వెనుక త‌న బావ సుబ్బారెడ్డి ఉన్నార‌ని బాలినేని అనుమానిస్తున్నారు.  వైవీ సుబ్బారెడ్డి టార్గెట్‌గా బాలినేని పరోక్ష విమర్శలు చేశారు. త‌న‌పై పార్టీలో కొంద‌రు వేస్తున్న నిందలు, ఆరోపణలు భరించలేకపోతున్నాన‌ని కంటతడి పెట్టారు. వైకాపా ఆవిర్భావం నుంచి నేను కీలకనేతగా వ్యవహరిస్తున్న నాపై గొనె ప్రకాశ్‌రావుకు  తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఆయ‌న‌ని కావాలనే మాట్లాడిస్తున్నట్లు కనిపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌పై ఎమ్మెల్యేలతో సీఎంకు ఫిర్యాదు చేయిస్తున్నార‌ని వాపోయారు. పార్టీ మారుతున్నారంటూ కూడా ప్రచారం చేస్తున్నార‌ని,  ఇవన్ని ఎవరూ చేస్తున్నారో అందరికీ తెలుసు అని, త‌న బావ వైవీ సుబ్బారెడ్డిపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు బాలినేని శ్రీనివాస‌రెడ్డి.

వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో ఏ1 ఎర్ర గంగిరెడ్డి లొంగిపోయాడు. సీబీఐ విడుద‌ల చేసిన కాల్ మ్యాపులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక్క‌డే మిగిలాడు. హైకోర్టు అరెస్టు చేయ‌కుండా ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టు అట్రాసియ‌స్ అని కొట్టేసింది. మ‌రి అవినాష్ రెడ్డి అరెస్టు ఎందుకు ఆగుతుంద‌నేది అంద‌రినీ తొలిచేసే ప్ర‌శ్న‌. అవినాష్ రెడ్డి అరెస్టునూ ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని, అవినాష్ రెడ్డి త‌రువాత పైనున్న వారిని సేఫ్ చేసే ప‌నిలో జాప్యం చేస్తున్నార‌ని న్యాయ‌నిపుణుల విశ్లేష‌ణ‌. మ‌రోవైపు క‌ర్ణాట‌క ఎన్నిక‌లు మ‌రో 5 రోజుల్లో ముగియ‌నున్నాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఖ‌ర్చు బీజేపీది మొత్తం భ‌రిస్తున్న‌ది వైసీపీయేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. అక్క‌డ ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌కూ వివేకానంద‌రెడ్డి కేసులోనూ ఎటువంటి అరెస్టులు ఉండ‌క‌పోవ‌చ్చని, అక్క‌డ పోలింగ్ ముగిసిన వెంట‌నే అవినాష్ రెడ్డి అరెస్టుతో మొత్తం మేట‌ర్ క్లోజ్ చేసే ఒప్పందం జ‌రిగింద‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవినాష్ రెడ్డి వేకువ‌నే వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఓఎస్డీ, భార‌తి పీఏ న‌వీన్ ఫోన్ల‌కి కాల్ చేసిన అంశం చాలా కీల‌మైన‌ది తెర‌మ‌రుగు కావ‌డం వెనుక కేంద్రం ఆశీస్సులున్నాయ‌ని తెలుస్తోంది. ఎలాగూ అడ్డంగా బుక్క‌యిపోయాడు కాబ‌ట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కేసుని క్లోజ్ చేసి ఆ దంపతుల‌ని సేవ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది.

వైఎస్ కుటుంబానికి పులివెందుల అడ్డా. రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ్య‌వ‌హారాల‌తోపాటు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వైఎస్ వివేకానంద‌రెడ్డి క‌నుస‌న్న‌ల్లో ఉండేది. వైఎస్ పావురాల‌గుట్ట‌లో హెలికాప్ట‌ర్ కూలి దుర్మ‌ర‌ణం పాల‌వ‌డంతో పులివెందుల ఈక్వేష‌న్ష్ మారిపోయాయి. బాబాయ్ వివేకానంద‌రెడ్డి కాంగ్రెస్లో చేర‌డంతో వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌ర‌ఫున పులివెందుల వ్య‌వ‌హారాలు చూసేందుకు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డి, వీరి చిన్నాన్న మ‌నోహ‌ర్ రెడ్డి దిగారు. అనంత‌రకాలంలో జ‌గ‌న్ బాబాయ్ వివేకానంద‌రెడ్డి కూడా వైసీపీలో చేరారు. కానీ పులివెందుల‌లో ప‌ట్టుజారిపోయింది. ఈ నేప‌థ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డి మ‌రికొంద‌రితో క‌లిసి వివేకానంద‌రెడ్డిని దారుణంగా చంపించేశార‌ని సీబీఐ ఆరోపిస్తోంది. ఏ పులివెందుల‌లో ప‌ట్టు కోసం బాబాయ్‌ని అబ్బాయిలు వేసేశారో.అదే పులివెందుల నుంచి వారు కూడా జైలుబాట ప‌ట్టేలా ఉన్నారు. తండ్రి ఆల్రెడీ జైలుకి చేర‌గా, నేడో రేపో త‌న‌యుడు అవినాష్ రెడ్డి కూడా అరెస్టు అవుతాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ రెడ్డి త‌న త‌ర‌ఫున పులివెందుల బాధ్య‌త‌లు చూడ‌టానికి డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్‌రెడ్డిని దింపుతున్నార‌ని స‌మాచారం. అవినాష్ రెడ్డిని కాపాడ‌టానికి చేసిన విశ్వ‌ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంతో ..బాబాయ్ మ‌ర్డ‌ర్ కేసు త‌న‌వ‌ర‌కూ రాకుండా చూడాలంటే అవినాష్ రెడ్డితో ఆగిపోయేలా చేసుకోగ‌లిగాడ‌ని టాక్ వినిపిస్తోంది. బాబాయ్‌ని చంపేశారు. అబ్బాయిలు జైలుకెళ్లారు. ఇప్పుడు పులివెందుల బాధ్య‌త‌లు చూడ‌టానికి త‌మ మ‌నిషే కావాలి అనే కోణంలో డాక్ట‌ర్‌ వైఎస్ అభిషేక్ రెడ్డిని రంగంలోకి దింపార‌ని తెలుస్తోంది. వైఎస్ ప్ర‌కాశ్‌రెడ్డి మ‌న‌వ‌డైన అభిషేక్ రెడ్డి, ఆయ‌న భార్య డాక్ట‌ర్లు కావ‌డంతో ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర కాగ‌ల‌ర‌ని సీఎం జ‌గ‌న్ రెడ్డి భావిస్తూ..వీరిని రంగంలోకి దింపార‌ని తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read