ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడి బజారులో అపహాస్యం అవుతున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యానికి వెన్నుముక లాంటి ఎన్నికలను కూడా, తమ సొంత పంచాయతీ లాగా చేసి పడేసారు. నామినేషన్ వేయటమే గగనంగా మార్చారు. ధైర్యం చేసి నామినేషన్ వేసినా, అధికార బలంతో, ఆ నామినేషన్ తిరస్కరించేస్తున్నారు. తాజాగా జరుగుతున్న 12 పురపాలక సంఘాల ఎన్నికల విషయంలో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నామినేషన్ వేసిన టిడిపి వాళ్ళకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చూపించి నామినేషన్లు తిరస్కరిస్తుంటే, కొన్ని చోట్ల ఫోర్జరీ సంతకాలతో తిరస్కరిస్తున్నారు. దీనికి ప్రధానంగా వీరి ధైర్యం ఏమిటి అంటే, ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలు అయితే మాత్రం, అందులో కోర్టులు జోక్యం చేసుకోవు. ఎలాంటి ఇబ్బందులు పడినా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్దే తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఆసరాగా తీసుకుని అధికార పార్టీ చెలరేగి పోతుంది. తాజాగా, నెల్లూరు, రాజంపేటలో ఇలాగే టిడిపి నేతల నామినేషన్లను చిన్న చిన్న కారణాలు చూపించి తిరస్కరించారు. అయితే దీని పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ పిటీషన్ పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. సరైన కారణాలు లేకుండా, చిన్న చిన్న అంశాలు సాకుగా చూపిస్తూ నామినేషన్లను తిరస్కరించటం పై, రిటర్నింగ్ అధికారులు మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న చిన్న కారణాలతో నామినేషన్ ను తిరస్కరించటం ఏమిటి అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు నామినేషన్ ఎప్పుడు తిరస్కరించారో కూడా, వాటి పైన డేట్ వేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారులు తాము ప్రభుత్వ ఉద్యోగులము అనే విషయం మర్చిపోయారా అంటూ, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారులు పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రిటర్నింగ్ అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చితే వారికి నోటీసులు ఇచ్చి వివరణ కోరతాం అని కోర్టు చెప్పింది. అయితే నామినేషన్లు పరిగణలోకి తీసుకునే విషయంలో తాము ఏదీ చేయలేం అని, ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గరే ఈ విషయం తేల్చుకోవాలని, లేదంటే ఎన్నికల పిటీషన్ దాఖలు చేయాలని కోర్ట్ ఆదేశించింది.