రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఈ రోజు కొద్ది సేపటి క్రితం చీఫ్ `జస్టిస్ `ఆధ్వర్యంలోని ధర్మాసనం సీరియస్ అయ్యింది. నరేగా నిధులు ప్రభుత్వం చెల్లించకపోవటంతో, అనేక మంది ఈ అంశం పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. తమకు చెల్లించాల్సిన నిధులు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుని కోరారు. దీనికి సంబంధించి గత మూడు నెలలుగా ఈ అంశం పై హైకోర్టు విచారణ జరుపుతుంది. గుంటూరుకు చెందిన న్యాయవాది నర్రా శ్రీనివాస్ పిటీషనర్ల తరుపున వాదనలు వినిపించారు. ఈ వాదనలు అనంతరం రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. అయుదు లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులు అన్నీ చెల్లించాలని అని ఇచ్చిన ఆదేశాలు కూడా, హైకోర్టు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని నర్రా శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో ఒక్కసారిగా చీఫ్ జస్టిస్ ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఆగస్టు 1 లోపు చెల్లింపులు అన్నీ చెల్లించాలని, లేకపోతే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తమ ముందుకు హాజరు కావాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఇదే మీకు చివరి అవకాసం ఇస్తున్నామని, ఆ తరువాత ఇక అవకాశాలు ఉండవని, తదుపరి చర్యలు చేపడతామని కూడా హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. అయితే ఈ సందర్బంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీని కూడా కోర్టుకు పిలుస్తాం అని హైకోర్టు చెప్పటంతో, ఒక్కసారిగా అలెర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది, తొందర పాటు చర్యలు వద్దని, తాము బిల్లులు చెల్లిస్తామని హైకోర్టుకు విజ్ఞప్తి చేయటంతో, హైకోర్టు శాంతించింది. ఇదే ధర్మాసనం, ఇదే కేసు పై గతంలో అనేక సార్లు ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేక పోయిందని, అసలు ఎందుకు మీరు బిల్లులు చెల్లించలేక పోతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఇది అతి పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇంకా చాలా మందికి జీతాలు వేయలేదు. ఈ బకాయలు రూ.2,500 కోట్ల వరకు ఉన్నాయి. మరి ఆగష్టు ఒకటో తేదీ లోపు ప్రభుత్వం, ఈ నిధులు ఎలా సమకూర్చుతుంది అనేది చూడాలి.