ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. గ్రామ సచివాలయానికి సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేయాలని, జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ 2ను హైకోర్టు ఈ రోజు సస్పెండ్ చేసింది. మూడు నెలల క్రిందట గ్రామ సచివాలయంలో ఉండే పంచాయతీ సర్పంచులతో పాటుగా, కార్యదర్శుల అధికారులను వీఆరోవోలకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, జీవో నెంబర్ 2 ను జారీ చేసింది. అయితే ఈ జీవో పై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సర్పంచ్ అధికారాలు కోత పెడితే ఉపయోగం ఏమి ఉంటుంది అంటూ, అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రభుత్వం నిర్ణయం, జీవో నెంబర్ 2 ని సవాల్ చేస్తూ, గుంటూరు జిల్లా, తురకపాలెం గ్రామానికి చెందిన సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టు మెట్లు ఎక్కారు. పిటీషనర్ కృష్ణమోహన్ తరుపున నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పంచాయతీ సర్పంచ్ అధికారాలను ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించారు. ఇన్నాళ్ళు సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలోనే పరిపాలన జరిగింది కదా వాదించారు. దీని పై కోర్టు గతంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక పక్క పంచాయతీలు, సర్పంచులు ఉండగా, మరో వ్యవస్థ ఎందుకు తీసుకుని వస్తున్నారని, గ్రామ సచివాలయం వ్యవస్థ ఎందుకు అని కోర్టు ప్రశ్నించింది.
సర్పంచ్ కంటే వీఆరోవో లకు ఎక్కువ అధికారాలు ఇవ్వటం, రాజ్యంగ విరుద్ధం కదా అని ప్రశ్నించారు. జీవో రెండు ప్రకారం గ్రామ పంచాయతీని సచివాలయంగా మార్చేశారని పిటీషనర్ వాదనలు హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే ప్రభుత్వం మాత్రం, సేవలను మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అయితే కోర్టు మాత్రం, ఈ వ్యవస్థ ఎందుకు, గ్రామ సచివాలయం ద్వారా ఎందుకు చేరువ చేయకూడదని ప్రశ్నించారు. పంచాయతీలకు నిధులు ఎక్కువ కేటాయింపులు చేసి, వసతులు పెంచవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఇది సర్పంచ్ అధికారులు లాగేసుకోవటమే కదా అని ప్రశ్నించింది. అయితే దీని పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి, ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు హైకోర్టు దీని పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవోని సస్పెండ్ చేసింది. గ్రామ సర్పంచ్ అధికారాలను, వీఆర్వో లకు ఇవ్వటానికి కోర్టు ఒప్పుకోలేదు. రాష్ట్రానికి సియం ఎలాగో, పంచాయతీలకు సర్పంచ్ అలాగే అని, కోర్టు వ్యాఖ్యానిస్తూ, ఈ కేసు పై తదుపరి విచారణకు కేసుని వాయిదా వేసింది.