పదవ తరగతి, ఇంటర్ పరీక్షల విషయంలో, ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ వచ్చింది. దేశంలోని 24 రాష్ట్రాలతో పాటుగా, కేంద్రం కూడా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసాయి. అయితే ఇక్కడ పరీక్షలు రద్దు విషయం పై, టిడిపి పోరాటం చేస్తూ ఉండటం, నారా లోకేష్ ఈ పోరాటాన్ని లీడ్ చేస్తూ ఉండటంతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పంతానికి వెళ్ళింది. ఏది ఏమైనా పరీక్షలు పెట్టి తీరుతాం అంటూ ప్రకటనలు చేస్తుంది. మరో పక్క ఇతర రాష్ట్రాల్లో, అలాగే మన రాష్ట్రంలో సిబిఎస్ఈ చదివే పిల్లలు మాత్రం, పడవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు కావటంతో, తదుపరి తరగతుల్లో జాయిన్ అయ్యారు. అలాగే ఇతర పోటీ పరీక్షలకు రెడీ అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం, అసలు పరీక్షలు ఉంటాయో లేదో తెలియదు. ఉంటే ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఇలా అనేక విషయాల్లో పూర్తిగా కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం దిగి రాక పోవటంతో, కొంత మంది సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. సిబీఎస్ఈతో పాటుగా, ఇతర అన్ని పరీక్షలు రద్దు చేయాలి అంటూ, ఇప్పటికే సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ నడుస్తుంది. అయితే ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిన నేపధ్యంలో, నిన్న ఈ పిటీషన్ పై విచారణ జరిగింది. పలువురు వాదనలు వినిపించారు.
పిటీషనర్ల తరుపున అడ్వొకేట్ మమతా శర్మ వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి, సుప్రీం కోర్టు డివిజినల్ బెంచ్ ఈ పిటీషన్ పై వాదనలు వింది. అయితే ఇప్పటి వరకు 18 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసారని, అలాగే ఆరు రాష్ట్రాల్లో క-రో-నా సెకండ్ వేవ్ కంటే ముందే పరీక్షలు అయిపోయాని, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా పరిక్షలు రద్దు చేయాలని వాదనలు జరిగాయి. సుప్రీం కోర్టు బెంచ్ కూడా దీని పై సానుకూలంగా స్పందిస్తూనే, ఇప్పటి వరకు పరీక్షలు రద్దు చేయని నాలుగు రాష్ట్రాలకు నోటీసులు పంపించింది. ఈ నెల 21 లోపు సమాధానం చెప్పాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. అయితే ఇన్నాళ్ళు మొండిగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తమ నిర్ణయాన్ని చెప్పినా, అన్ని రాష్ట్రాలు రద్దు చేస్తే, కేంద్రం కూడా రద్దు చేస్తే, మీకు ఏమి ఇబ్బంది అని కోర్టు అడిగే అవకాసం ఉంది. ఇప్పటికే 24 రాష్ట్రాలు ఒక వైపు ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర మూడు రాష్ట్రాలకు కూడా పరీక్షలు రద్దు పై సుప్రీం ఒక నిర్ణయం ప్రకటించే అవకాసం ఉంది.