ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పదవి టిటిడి బోర్డు లో పదవి. ఆ బోర్డు చైర్మెన్ పదవి అంటే ఇంకా పెద్ద డిమాండ్. ఇంతటి డిమాండ్ ఉన్న టిటిడి బోర్డు విషయంలో, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎవరికీ చైర్మెన్ పదవి ఇస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే అనూహ్యంగా ఆ పదవిని తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. నిజానికి వైవీ సుబ్బారెడ్డి ఇంకా పెద్ద పదవి ఆశించారు. రాజ్యసభ సభ్యత్వం కానీ, ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి కానీ ఇవ్వమని అడిగినట్టు సమాచారం. అయితే సామాజిక సమీకరణలో దృష్టిలో పెట్టుకుని, జగన్ ఇవ్వలేదని తెలుస్తుంది. నిజానికి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి, జగన్ కు అండగా నిలిచి, పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ వచ్చారు సుబ్బారెడ్డి. అయితే 2019 ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వలేదు. అయితే పదవిలోకి వచ్చిన తరువాత సుబ్బారెడ్డికి టిటిడి బోర్డు చైర్మెన్ పదవి ఇచ్చారు. ఆయనకు పదవి ఇచ్చిన సమయంలో, ఒక క్రీస్టియన్ కు పదవి ఇచ్చారు అంటూ ప్రతిపక్షాలు గోల చేసినా, ఆ ప్రచారాన్ని వైసిపీ తిప్పి కొట్టింది. ఇక బోర్డు విషయంలో కూడా, ఎప్పటికంటే ఎక్కువ మంది సభ్యులతో ఒక జంబో బోర్డు వేసారు జగన్ మోహన్ రెడ్డి. ఈ బోర్డు పదవీ కాలం రెండేళ్ళు కాగా, బోర్డు పదవీ కాలం ఈ నెల 21తోనే ముగిసింది.
దీంతో ఇప్పుడు కొత్త చైర్మెన్, సభ్యుల పై మళ్ళీ చర్చ మొదలైంది. అయితే ఈ చర్చ జరుగుతూ ఉండగానే, కొత్త బోర్డు వేసే వరకు, స్పెసిఫైడ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిటిడి ఈవో, ఈ కమిటీకి చైర్మెన్ గా ఉంటారు. టిటిడి బోర్డు కు ఉండే అధికారాలు మొత్తం, ఈ బోర్డు కి ఇచ్చారు. దీంతో ఇక ఇప్పట్లో కొత్త బోర్డు ఏర్పాటు లేదనే తెలుస్తుంది. ప్రభుత్వ వర్గాలు మరో పది పదిహేను రోజుల్లో కొత్త బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్తున్నా, ఈ స్పెసిఫైడ్ కమిటీ వేయటంతో, కొత్త బోర్డు ఇప్పట్లో లేనట్టే అని అర్ధం అవుతుంది. దీంతో మళ్ళీ తానే చైర్మెన్ అనుకున్న సుబ్బారెడ్డి ఆశలు అడియాసలు అయ్యాయి. ఇప్పట్లో, అంటే మరో ఏడాది వరకు రాజ్యసభ ఖాళీలు కూడా ఏమి లేవు. తరువాత నాలుగు స్థానాలు ఖాళీ అయినా, అందులో ఒకటి విజయసాయి రెడ్డికి ఇస్తే, మరో పదవి అదే రెడ్డి సామాజికవర్గానికి ఇచ్చే అవకాసం తక్కువ. దీంతో, ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి రాజకీయ కెరీర్ సస్పెన్స్ లో పడింది. ఆయనకు మళ్ళీ చైర్మెన్ పదవి ఇవ్వకపోతే, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.