రైతుల సహాయసహాకారాలతో, వారిప్రోత్సాహంతో, గ్రామీణ ప్రాంతానికిచెందిన మహిళాపాడిరైతుల ప్రోద్భలంతో నడుస్తున్న సంగం డెయిరీ నేడు ఒకపెద్ద పరిశ్రమగా అవతరించిందని, కంపెనీ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని టీడీపీ నేత, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "సంగం డెయిరీ వ్యవహారంలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంగం డెయిరీకి చెందిన పదిఎకరాల భూమిని ఒకట్రస్ట్ కు బదలాయించారని, అలా చేసేక్రమంలో డెయిరీ ఛైర్మన్ గా ఉన్న నరేంద్ర అవినీతికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు మోపడం జరిగింది. మరో అంశమేమిటంటే, కోఆపరేటివ్ సొసైటీగా ఉన్న సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ లోకి తీసుకురావడానికి, తప్పుడు ధృవపత్రాలు సమర్పించి వాడుకున్నారని చెప్పి, నరేంద్రపై కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసానికి పాల్పడ్డారంటూ ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేయడం జరిగింది. ఏపీ ప్రజలకు, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. సంగండెయిరీ అనేది కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడింది. దానికింద ఉన్నభూమిలోనుంచి పది ఎకరాలను డెయిరీ మాజీఛైర్మన్ అయిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుమీదున్న ట్రస్ట్ కు బదలాయించారు. చట్టబద్ధంగానే పదిఎకరాలు బదలాయించారా....లేదా అని చూస్తే అదిఅంతా సక్రమంగా చట్టప్రకారమే జరిగినట్లు అర్థమ వుతోంది. 10, 12ఏళ్ల క్రితమే సంగం డెయిరీ కంపెనీ యాక్ట్ లోకిమారిపోయింది. అలా మారకముందు అది మ్యాక్స్ సొసైటీ పరిధిలో ఉంది. మ్యాక్స్ సొసైటీకి సంబంధించిన నో అబ్జెక్షన్ (నిరభ్యంతర పత్రము) తోనే డెయిరీ కంపెనీ యాక్ట్ లోకి మారిందని, అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని ప్రజలను నమ్మించే ప్రయత్నాలుచేస్తున్నారు. ఎవరైతే ఆసమయంలో డీసీవో (డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్) గా ఉన్న గుర్నాథం, అది ఫోర్జరీ డాక్యుమెంట్ కాదని, నో అబ్జెక్షన్ సర్టి ఫికేట్ తానే ఇచ్చానని చెప్పడం జరిగింది.
గుర్నాథాన్ని అరెస్ట్ చేయించిన ప్రభుత్వం నేడు ఆయన్నికోవిడ్ కు గురయ్యేలా చేసింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తానే ఇచ్చాను, అది ఫోర్జరీ డాక్యుమెంట్ కాదని గుర్నాథం చెప్పాకకూడా, నరేంద్రకుమార్ ఫోర్జరీ చేశాడని, ఛీటింగ్ చేశాడని ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? పదిఎకరాల బదలాయింపు జరిగిం దంటున్న అభియోగాల్లో కూడా వాస్తవం లేదు. భూమిని ట్రస్ట్ కు బదలాయించినప్పుడు 2003లో సంగండెయిరీ ఛైర్మన్ గా నరేంద్ర లేడని గుర్తించాలి. ఈ విధంగా అసత్యాలు, అబద్ధపు ఆరోపణలతో కావాలనే నరేంద్రను అరెస్ట్ చేశారని స్పష్టమవుతోంది. ఇటీవల ఆ నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమమైనింగ్ సహా, రాజధాని భూముల వ్యవహరంలో ప్రభుత్వం ఆరోపించిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను నరేంద్ర మీడియాముఖంగా సమర్థంగా తిప్పికొట్టారు. తాను ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డట్టు ప్రభుత్వం నిరూపించాలని ఆయన సవాల్ చేస్తే, ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవకతవకలను, దుశ్చర్యలను, అసత్యపు ఆరోపణలను నరేంద్ర ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడనే ఆయనపై కక్ష కట్టారని తేలిపోయింది. తెలుగుదేశంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని కూడా ఆయనపై ప్రభుత్వం కక్ష పెంచుకోవడానికి ఒక కారణం. ఏసీబీ వారికి ఎవరూ ఫిర్యాదుచేయలేదు, ఎవరికైతే సంగం డెయిరీతో, సంస్థ ఆస్తులతో సంబంధంలేదో వారు ఫిర్యాదుచేస్తే అరెస్ట్ చేయడం దుర్మార్గం. భూమి బదలాయింపునకు సంబంధించిన ప్రతి అంశాన్ని నేడు హైకోర్టు ముందుంచడం జరిగింది. దానికి సంబంధించిన ఏ అంశాన్ని ఏసీబీ పరిగణనలోకి తీసుకోలేదు.