ఆంధ్రప్రదేశ్ లో గౌరవముఖ్యమంత్రి నేత్రత్వంలో అసమర్థ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, క-రో-నా కబంధహస్తాల్లో చిక్కుకొని రాష్ట్రమంతా విలవిల్లాడుతుంటే, వేలాదిమంది చనిపోతుంటే, ఆ చితిమంటల వెలుగులుచూసి, ఘనత వహించిన ముఖ్యమంత్రి నీరోచక్రవర్తిని మించిన ఆనందాన్ని పొందుతున్నాడని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు. గురువారం ఆయన తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...! ఈ మంత్రిమండలి , ఈ ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థంకావడంలేదు, క-రో-నా రోగులకు కావాల్సిన వైద్యం, మందులు, ఇంజెక్షన్లు సకాలంలో అందడం లేదు. వారికి కావాల్సిన ఆక్సిజన్, వెంటిలేటర్లు అందడంలేదు. వీటన్నింటిపై ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే స్థితిలో లేదు. క-రో-నా రక్కసి విశృంఖలంగా రాష్ట్రాన్ని సవాల్ చేస్తుంటే, ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిస్తేజంగా ఉండిపోయారు. క-రో-నా-ను ఎలా కట్టడిచేయాలన్నఆలోచన ముఖ్యమంత్రికి, కేబినెట్ కు లేదు. అవగాహన అసలేలేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దురాలోచనతో తీసుకుంటున్నట్లు ఉన్నాయిగానీ, దూరాలోచనతో చేస్తున్నట్లుగా లేవు. క-రో-నా-తో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామంటారా? ఏమిటీ విచిత్ర వైఖరి ముఖ్యమంత్రిగారు? మీకు అవగాహన, ఆలోచన లేవని రాష్ట్రప్రజలకు తెలుసు. చంటిబిడ్డలైన విద్యార్థులపై ముఖ్యమంత్రి ఎందుకింతలా కక్షబూనాడు. ముఖ్యమంత్రి పగ, ద్వేషం విద్యార్థులపైనా లేక వారి తల్లిదండ్రులపైనా? అన్నిరాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేశాయికదా..! విద్యార్థుల సర్టిఫికెట్లపై పాస్ అని రాస్తే వారి భవిష్యత్ కు వచ్చినఇబ్బంది ఏమిటి? వాయిదా వేయండి.. జూన్ లోనో, జూలైలోనో నిర్వహించండి. విద్యార్థులప్రాణాలకు ఏదైనాజరిగితే, ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా?
ప్రతిపక్షా ల వారు మీడియాతో మాట్లాడే అంశాలపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టరు. ఏంచేయాలో, ఏం చేస్తున్నామో ఆలోచించరు. ఇదేమిటండీ? తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లడానికి ముఖ్యమంత్రికి క-రో-నా అడ్డువచ్చింది. మరి అలాంటప్పుడు పరీక్షలు రాసేవిద్యార్థుల్లో ఎవరికైనా క-రో-నా వస్తే తానే బాధ్యత తీసుకుంటానని ఈ ముఖ్యమంత్రి చెప్పగలడా? అసలు ఇది ప్రభుత్వమా..లేక వల్లకాడా? ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. అధికారయంత్రాంగాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. చనిపోయిన వారందరికీ ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వగలరా? రేపొద్దున ఫలానా మహానుభావుడు అధికారంలో ఉన్నప్పుడు తమవారు చనిపోయారని భావితరాలవారు చెప్పుకోవాలి కదా? ముఖ్యమంత్రికి ధైర్యముంటే, నైతిక విలువలుంటే, అలా ఇవ్వగలరా? అసెంబ్లీ నిర్వహించాలంటే 150 నుంచి 200 మంది వస్తారు. పరీక్షలు పెడితే ఎంతమంది విద్యార్థుల వస్తారో తెలియదా? మంత్రికూడా తన తెలివితేటలు, బుర్ర ప్యాక్ చేసి, పక్కన పెట్టినట్లు ఉన్నాడు. పరీక్షలు నిర్వహిస్తే ముఖ్యమంత్రిగానీ, కేబినెట్ మంత్రులుగానీ, విజయవాడలో ఒక్క పరీక్షా కేంద్రాన్నైనా తనిఖీ చేయగలరా? చీఫ్ ఇన్విజి లేటర్ గా ముఖ్యమంత్రి ఒక్కరోజు, ఒక్క పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించగలరా? అటువంటి పరిస్థితుల్లో పరీక్షలు పెడతారా? మీరు, మీ మంత్రుల ప్రాణాలు ఉంటే చాలా? ఎందుకింత దుర్మార్గంగా, మొండిగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు?
ఆదినుంచీ ముఖ్యమంత్రి క-రో-నా విషయంలో తేలికదృష్టితోనే వ్యవహరించారు. పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే కరోనా పోతుందన్నది నిజం కాదా? క-రో-నా వచ్చిన మొదటిరోజే ముఖ్యమంత్రి అవగాహ నతో, సముచిత నిర్ణయాలు తీసుకుంటే, ఇప్పుడు ఇంతటి దారుణమైన పరిస్థితులుండేవా? పారాసెట్మాల్ కు, బ్లీచింగ్ కు క-రో-నా పోతే, వేలకు వేలు గుంజుతూ బ్లాక్ మార్కెట్లో ఇంజెక్షన్లు ఎందుకు అమ్ముతున్నారు? ఎలా చెబితే ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది? పదివేల మంది విద్యార్థులు ఒకేసారి పరీక్ష రాయడానికి వస్తే, ఎన్ని వైద్యబృందాలను నియమించి, పరీక్షలు చేయగలరు? ఒక్కో బృందం గంటలో ఎందరు విద్యార్థులకు పరీక్ష చేయగలదు? రాష్ట్రప్రజలు ఈ ముఖ్యమంత్రికి ఎలా ఓట్లేశారనేది ఇప్పటికీ రహస్యమే. ముఖ్యమంత్రి తక్షణమే అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి, పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు, లేదా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాలి. లక్షలాది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఈ గుడ్డి ప్రభు త్వానికి, అవగాహనా రాహిత్య ప్రభుత్వానికి తెలియచేస్తున్నా .. క-రో-నా వైద్యంపై, దాని విస్తృతిపై ప్రభుత్వానికి అవగాహనే లేదు. ఈ రాష్ట్రంలోని బిడ్డలందరూ తనబిడ్డలేనని ముఖ్యమంత్రి భావించాలి. వారిని అష్టకష్టాలపాలు చేయకుండా, వారిని బలి తీసుకోకుండా, ముఖ్యమంత్రి సముచిత నిర్ణయం తీసు కోవాలి. వయస్సులో పెద్దవాడినైనా సరే, ముఖ్యమంత్రికి చేతులెత్తి నమస్కారం చేస్తాను. పరీక్షల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని ముఖ్యమంత్రి గ్రహించాలి. ఏ బిడ్డకై నా ఏదైనా జరిగితే ముఖ్యమంత్రికి ముసళ్ల పండగ ముందుంటుంది. తక్షణమే ముఖ్యమంత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి, పదోతరగతి, ఇంటర్ పరీక్షలను రద్దుచేయడమో, వాయిదా వేయడమో చేయాలి.