ఈ మధ్య కాలంలో, తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే, న్యాయమూర్తులను తిట్టటం ఫ్యాషన్ అయిపొయింది. ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న నేతలు కూడా, ఇలాగే తయారయ్యారు. ఏకంగా సోషల్ మీడియా వింగ్ లు పెట్టుకుని, వారికి డబ్బులు ఇచ్చి మరీ జడ్జిల పై విష ప్రచారం చేపిస్తున్నారు. మన రాష్ట్రంలోనే ఈ విష సంస్కృతీ తారా స్థాయికి వెళ్ళింది. దీని పై దేశ వ్యాప్త చర్చ కూడా జరిగింది. చివరకు హైకోర్టు, తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సిఐడి సరిగ్గా దర్యాప్తు చేయకపోవటంతో, ఏకంగా సిబిఐ దర్యాప్తు కూడా ఆదేశించారు. ఇక జగన్ మోహన్ రెడ్డి, కాబోయే చీఫ్ జస్టిస్ ని టార్గెట్ చేసుకుంటూ, చేసిన హంగామా అందరికీ తెలిసిందే. దీని పై ఇన్ హౌస్ ఎంక్వయిరీ చేసిన సుప్రీం కోర్టు, ఇవి నిరాధారమైన ఆరోపణలు అంటూ, కొట్టి పారేసింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పై చర్యలు తీసుకునే అవకాసం కూడా లేకపోలేదని, లేకపోతే ప్రతి ఒక్కరు, ఇలాగే న్యాయమూర్తుల పై బురద చల్లుతారని, ప్రచారం జరుగుతున్న తరుణంలో, కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి. న్యాయమూర్తులను దూషించే విషయంలో, కేంద్రం కూడా సీరియస్ గా ఉందనే సంకేతాలు వెళ్ళాయి. ఇక నుంచి న్యాయమూర్తుల పైన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, చూస్తూ ఊరుకోం అని సంకేతాలు ఇచ్చారు.
నిన్న బొంబాయి హైకోర్టులో, గోవా బెంచ్ ప్రారంభోత్సవానికి, చీఫ్ జస్టిస్ బాబ్డే, కాబోయే చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, అలాగే కేంద్ర మంత్రి కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర మంత్రి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా, జడ్జిలను దూషించటం ఎక్కువపోయిందని అన్నారు. తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, తీర్పు పైన చర్చ జరగాలి కాని, న్యాయమూర్తులను టార్గెట్ చేయటం ఏమిటి అని ప్రశ్నించారు. కావాలని న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని, సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టటం సరికాదని, ఇది మంచి పద్దతి కాదని వార్నింగ్ ఇచ్చారు. ఇక చీఫ్ జస్టిస్ బాబ్డే కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేసారు. కొంత మంది స్వార్ధ శక్తులు, న్యాయ మూర్తులను టార్గెట్ చేసుకుంటున్నాయని అన్నారు. కేంద్ర మంత్రి అభిప్రాయంతో ఏకీభావిస్తున్నానని అన్నారు. అయితే న్యాయమూర్తులు ఇవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళాల్సి ఉందని అన్నారు. మరి కేంద్ర మంత్రి, చీఫ్ జస్టిస్ ఈ తరహా వ్యాఖ్యలు చేసారంటే, ఇక నుంచి న్యాయమూర్తులను టార్గెట్ చేస్తున్న వారి, హద్దుల్లో ఉంటే మంచిది.